అధికారం ఉంటేనే ఉత్సవాలు .. వెలవెలబోయిన బీఆర్ఎస్ 24వ ఆవిర్భావం

అధికారం ఉంటేనే ఉత్సవాలు ..   వెలవెలబోయిన బీఆర్ఎస్ 24వ ఆవిర్భావం

హైదరాబాద్: అధికారం ఉంటేనే ఉత్సవాలు.. పండుగలు. ఇది ఈరోజు జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో మరోమారు రుజువైంది. గతేడాది ఏప్రిల్ 27న తెలంగాణ భవన్ గులాబీ జెండాలతో కళకళలాడింది. తెలంగాణ భవన్ ప్రాంగణంలో పార్కింగ్ కు జాగా దొరకడం కష్టమైంది. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయమ్యాయి. మెట్రె పిల్లర్లన్నీ.. తెలంగాణ ఆచరిస్తున్నది. . దేశం అనుసరిస్తున్నది అంటూ సర్కారు పథకాల వివరించే ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

 ఊరూరా బైక్ ర్యాలీలు, జెండా విష్కరణతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం కనిపించింది. గులాబీ లీడర్లు రక్తదాన శిబిరాలు చేశారు. ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ జరిగింది. ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలను గులాబీ దండలతో ముంచెత్తారు. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా (కే)లో ఏకంగా ఒక రోజు ముందే ఉత్సవాలు ప్రారంభించి ఎడ్లబండిపై కేసీఆర్ చిత్రపటాన్ని ఉంచి పాలాభిషేకం చేసి ఏకంగా ఊరూరా ఊరేగించారు. 

నామమాత్రంగా

అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవం సాదా సీదాగా సాగింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జెండావిష్కరణకు రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. చాలా తక్కువ సంఖ్యలో లీడర్లు హాజరయ్యారు. గులాబీ జెండా ఆవిష్కరించిన కేటీఆర్ పిడికెడు మందితోనే కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద కార్ల సందడి లేదు.. సిటీలో గులాబీ జెండాలు ఎగురలేదు. మెట్రో పిల్లర్లకు పార్టీ ఫ్లెక్సీలు కనిపించలేదు. కనీసం తెలంగాణ భవన్ వద్ద కూడా పండుగ వాతావరణమే కనిపించపోవడం గమనార్హం. 

2023 ఏప్రిల్ 27

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, జెడ్పీ, డీసీఎంఎస్ చైర్మన్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్యనాయకులు కలిపి మొత్తం 279 మంది ప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్ కేకే వెన్నంటి ఉన్నారు. 

2024 ఏప్రిల్ 27  

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పరిమిత సంఖ్యలో నాయకులే వచ్చారు. తెలంగాణ భవన్ వద్ద కార్ల హడావుడి లేదు. ఆ దారిలో ఫ్లెక్సీలు కూడా లేవు. జెండా విష్కరణ తర్వాత కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేసి ఇంటికి వెళ్లారు.