- బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం కలే..
- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, వెలుగు: కేసీఆర్ ముందుగా తన కుటుంబ సమస్యలను సరిచేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కుటుంబంలోనే తండ్రీ కొడుకులు, అన్నాచెల్లెలు, మామ అల్లుడు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంగళవారం నల్గొండలోని తన క్యాంపు ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుమార్తె కవితే తరచూ కుటుంబ వ్యవహారాలపై విమర్శలు చేస్తున్నారని.. కవిత, హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్ రావులు తలో దారి పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.
కేసీఆర్ అసహనంతోనే జగిత్యాల సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. గతంలో దళితుడే సీఎం, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

