- 7 కార్పొరేషన్లలో కనీసం పోటీ ఇవ్వని కేటీఆర్ టీమ్
- నాలుగు మున్సిపాలిటీల్లో ఖాతా కూడా తెరవని పార్టీ
- భైంసా, ధర్మపురి, కోస్గి, మక్తల్‌లో జీరో
- 13 మున్సిపాలిటీల్లో గెలిచింది ఒక్కో వార్డే
- మరో 67 మున్సిపాలిటీల్లో నామమాత్ర పోటీ
- కేసీఆర్ సొంత సెగ్మెంట్ గజ్వేల్‌లోనూ అతికష్టంగా గెలుపు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ డీలా పడింది. ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినా.. కొన్ని చోట్ల అసలు ఖాతా కూడా తెరవలేదు. మరికొన్ని చోట్ల ఒక్క సీటుకే పరిమితమైంది. 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 15 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. అదే సమయంలో ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్‌వి 420 హామీలని, ఎవరికీ మేలు జరగలేదని పార్టీ నేతలు చేసిన ప్రచారం ఫలితాలను ఇవ్వలేకపోయింది. బస్తీబాట కార్యక్రమం చేపట్టినా.. ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించకపోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కార్పొరేషన్లలో ..
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమాగా చెప్పినప్పటికీ.. కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కనీస పోటీని ఇవ్వలేకపోవడం గమనార్హం. నిజామాబాద్‌లో అయితే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడి కార్పొరేషన్లో 60 వార్డులుండగా.. కేవలం ఒక్క వార్డును మాత్రమే గెలుచుకున్నది. మంచిర్యాల, కొత్తగూడెంలలో 60 చొప్పున వార్డులుండగా.. ఆ రెండు చోట్ల 8 చొప్పున వార్డులను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకున్నది. రామగుండంలో 13, మహబూబ్‌నగర్‌లో 11 వార్డులను గెలిచిన బీఆర్ఎస్.. నల్గొండ కార్పొరేషన్లో 9, కరీంనగర్లో 8 వార్డులను మాత్రమే సాధించడం గమనార్హం.
12 మున్సిపాలిటీల్లో గెలుపు..
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సహా 12 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. సిరిసిల్లలో ఆ పార్టీ స్పష్టమైన పోటీని ఇచ్చింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 స్థానాలుండగా.. 27 వార్డులను ఆ పార్టీ గెలిచింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి కేటీఆర్ అక్కడి మకాంవేసి ప్రత్యేక దృష్టి సారించారు. సిరిసిల్లతో పాటు గడ్డపోతారంలో 18 వార్డులకుగానూ 14 వార్డులు, తొర్రూరులో 16 వార్డులకు 9, గుమ్మడిదలలో 22 వార్డులకు 15, చేర్యాలలో 12 వార్డులకు 7, దుబ్బాకలో 11 స్థానాలు, గజ్వేల్‌లో 11, మూడుచింతలపల్లిలో 24 స్థానాలకు 14, ఆమన్‌గల్‌లో 15 స్థానాలకు 8, ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకు 13, ఐజలో 20కి 13, తిరుమలగిరిలో 15కు 10 వార్డులను గెలిచింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 775 స్థానాలను గెలిచింది. అదే సమయంలో 20 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, కేసముద్రం, జమ్మికుంట, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, జనగామ, ఎల్లంపేట, పరిగి, అలంపూర్, క్యాతనపల్లి, వర్ధన్నపేట, జనగామల్లో ఇతర పార్టీలకన్నా బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయి. అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులుండగా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో సమానంగా 3 సీట్లను గెలవడం
గమనార్హం.
నాలుగు చోట్ల సున్నా..
పలు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. 4 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డునూ గెలవలేదు. భైంసా, ధర్మపురి, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని వార్డుల్లోనూ ఓటమి చవి చూశారు. మరో 13 మున్సిపాలిటీల్లో ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెలిచింది. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, కొడంగల్, బూత్పూర్, వడ్డేపల్లి, ఆత్మకూరు, హాలియా, నందికొండ, మధిర మున్సిపాలిటీల్లో కేవలం ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 67 మున్సిపాలిటీల్లోనూ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. సిద్దిపేటలోనూ అతి కష్టమ్మీద గట్టెక్కింది. ముఖ్యంగా కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో చావుతప్పి కన్నులొట్టపోయినట్టు.. ఒకే ఒక్క సీటు మార్జిన్‌తో బీఆర్ఎస్ గెలుపొందింది. 20 వార్డులకుగానూ 11 వార్డులను గులాబీ దళం దక్కించుకున్నది. ఇటు దుబ్బాకలో లోనూ 20 స్థానాలుండగా.. ఒక్క వార్డు తేడాతో మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకుంది. అక్కడ కూడా 11 స్థానాలనే గెలిచింది. అయితే, హుస్నాబాద్‌లో మాత్రం 20 స్థానాలకు కేవలం 4 వార్డుల్లోనే బీఆర్ఎస్ గెలిచింది.
