రెండేండ్లలో కేసీఆరే సీఎం..కాంగ్రెస్‌‌‌‌కు మిత్తితో సహా చెల్లిస్తం: కేటీఆర్

రెండేండ్లలో కేసీఆరే సీఎం..కాంగ్రెస్‌‌‌‌కు  మిత్తితో సహా చెల్లిస్తం: కేటీఆర్
  • రేవంత్‌‌‌‌కు మళ్లీ చిప్పకూడు తినిపిస్తం: కేటీఆర్​
  • మున్సిపల్​ ఎన్నికల్లో అరాచకాలు చేసిన 
  • కాంగ్రెస్‌‌‌‌కు, బీజేపీకి జనం బుద్ధిచెప్పిన్రు
  • ఖాకీ బుక్​ ఏమైందో డీజీపీ చెప్పాలె
  • వచ్చే రెండేండ్లలో కేసీఆరే సీఎం అవుతరు..
  • మీరు తగిన శిక్ష అనుభవిస్తరని పోలీసులకు వార్నింగ్‌‌‌‌

ఆదిలాబాద్, వెలుగు:  రెండేండ్లలో తాము అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్‌కు మిత్తితోసహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మళ్లీ చిప్పకూడు తినిపిస్తామని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆదిలాబాద్‌లో కేటీఆర్​మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మున్సిపల్​ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసేలా కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చేసిన అరాచకాలను, దుర్మార్గాలను రాష్ట్రం మొత్తం గమనించిందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా మున్సిపాలిటీలను దక్కకుండా కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు.  డీజీపీ శివధర్‌‌రెడ్డి  పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టారని,- రెడ్ బుక్ ఉండదు.. పింక్ బుక్ ఉండదు..ఖాకీ బుక్ మాత్రమే ఉంటుంది అని అన్నారని కేటీఆర్​ పేర్కొన్నారు.  మరి ఈరోజు ఆ ఖాకీ బుక్ ఎక్కడికి పోయింది?  అని  ప్రశ్నించారు. అరాచకాలను అడ్డుకున్న తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, పోలీసులను  బండ బూతులు తిట్టిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై, బీజేపీ ఎంపీ అర్వింద్‌పై ఎందుకు కేసులు పెట్టలేదని అడిగారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు  ఒక న్యాయం, కాంగ్రెస్, - బీజేపీకి ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. ఆ నేతల అరాచకాలు డీజీపీకి కనిపించడం లేదా? అని అడిగారు.‘‘అధికారం ఎవడికీ శాశ్వతం కాదన్న విషయాన్ని డీజీపీ, రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలి.  వచ్చే రెండేండ్లలో కేసీఆర్ సీఎం అవుతారు.  రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. కచ్చితంగా మీ అరాచకాలకు అప్పుడు తగిన శిక్ష అనుభవిస్తారు” అని వార్నింగ్‌ ఇచ్చారు.  అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్‌‌ను కేటీఆర్​ పరిశీలించారు. ఆయన వెంట జోగురామన్న, అనిల్ జాదవ్, ప్రశాంత్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, సంజయ్ కల్వకుంట్ల, వివేకానంద గ్యాదరి కిషోర్ తదితరులున్నారు.