
- టిఫిన్ చేస్తుండగా, కడుపు మీద కూర్చుని గొంతు కోసిన వైనం
- అడ్డుకోబోయిన ఫ్రెండ్పైనా దుండగుల దాడి.
- పాత కక్షలే కారణం.
దిల్సుఖ్ నగర్, వెలుగు: నాగోల్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. టిఫిన్ చేస్తున్న యువకుడిని పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు దుండగులు కత్తితో గొంతు కోసి హతమార్చారు. అడ్డుకోబోయిన అతని స్నేహితుడిపైనా దాడికి చేశారు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. నాగోల్ హరిజన బస్తీకి చెందిన పంగ మనోజ్ (24), గంధం సంజయ్ ఫ్రెండ్స్. గతంలో ఓకే బ్యాండ్ బృందంలో పనిచేసిన వీరిద్దరూ గొడవల కారణంగా రెండేళ్లుగా వేర్వేరుగా పనులు చేసుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మనోజ్ తన స్నేహితుడు వంశీతో కలిసి నాగోల్ యూటర్న్ వద్ద టిఫిన్ చేసేందుకు స్కూటీపై వెళ్లాడు.
మొబైల్ క్యాంటీన్ ముందు మనోజ్ స్కూటీపై కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సంజయ్ పల్సర్ బైక్ పై మరో ఇద్దరు యువకులతో కలిసి వచ్చి, వెనుక నుంచి దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మనోజ్ కడుపులో పొడిచాడు. దీంతో కిందపడ్డ బాధితుడిని మిగిలిన ఇద్దరు మహేశ్, నరసింహ కదలకుండా గట్టిగా పట్టుకోగా, సంజయ్ మనోజ్ మీద కూర్చుని కత్తితో గొంతు కోశాడు. అక్కడే ఉన్న మనోజ్ స్నేహితుడు వంశీ వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతనిపైనా కత్తితో దాడిచేసి పారిపోయారు.
ఎడమ చేతికి గాయమైన వంశీ వెంటనే మనోజ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు డయల్100కు ఫోన్ చేయడంతో చైతన్యపురి ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మనోజ్‌ను పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. గాయపడిని వంశీని సమీప హాస్పిటల్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రాజీ చేసుకున్నా.. వదల్లేదు!
రెండేళ్ల కింద సంజయ్, మనోజ్ మధ్య గొడవ జరగగా, సంజయ్ ను మనోజ్ కత్తితో పొడిచాడు. దీంతో బాధితుడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మనోజ్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం ఇరువురి పెద్దల సమక్షంలో కేసును రాజీ చేసుకున్నారు. ఇందుకు కోసం మనోజ్ రూ. 3లక్షలను సంజయ్ కు ఇచ్చాడు. అయినప్పటికీ తనపై దాడి చేసిన మనోజ్ పై పగ పెంచుకున్న సంజయ్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాడు. అతని కదలికలపై నిఘా పెట్టి, నాగోల్ చౌరస్తాలో హత్య చేశాడు. 2016 లోనూ సరూర్ నగర్పీఎస్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ ను సంజయ్ రాయితో కొట్టి హత్య చేసి జైలుకు వెళ్లొచ్చాడు.