
గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉండటంతో సరిహద్దు భద్రతాదళం (BSF) సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ బోర్డర్ కు 20 కిలోమీటర్ల దూరంలో బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసారి, శివనగర్ గ్రామాల్లో రాత్రివేళ లైట్లు వేయవద్దని BSF గ్రామీణ ప్రజలకు ఆదేశించింది.
మేఘపురా, రండోసాన్ గ్రామాల్లోనూ రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలిగించవద్దని ఆదేశించిన BSF గ్రామాల గోడలపై హెల్ప్ లైన్ నంబర్లను పెయింట్ చేసింది. బీఎస్ఎఫ్ ఆదేశం తో తాము రాత్రివేళ గ్రామంలో కరెంట్ సరఫరా నిలిపివేశామని రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ చెప్పారు. పాక్ సరిహద్దుల్లోని ఈవల్ గ్రామంలోనూ విద్యుత్ దీపాలు స్వీచాఫ్ చేశామని స్థానిక సర్పంచ్ బాబుఅల్ తెలిపారు. రాత్రివేళ లైట్లు వేస్తే తమను సులభంగా గుర్తించి పాక్ సైనికులు దాడికి తెగబడే ప్రమాదముందన్నారు. సరిహద్దు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే BSF కు సమాచారం అందించాలని కమాండెంట్ గ్రామస్థులను కోరారు. పాక్ బోర్డర్ కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే తమ మేఘపూర్ గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉన్నా అటవీ మార్గం గుండా వెళితే కేవలం సరిహద్దు కిలోమీటరు దూరంలోనే ఉందని సర్పంచ్ చౌహాన్ చెప్పారు. మొత్తం మీద ఇండో-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతతో సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.