- హత్య తర్వాత ‘ఫుల్ మర్డర్’ అంటూ స్నాప్‌చాట్‌లో యువతి బావ పోస్ట్
- హత్య వెనుక మొత్తం 8 మంది
- నలుగురి అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
- నిందితులను వదిలేది లేదన్న డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
పద్మారావునగర్, వెలుగు: సిటీలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ అలియాస్ అఖిల్ (21) హత్యోదంతం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి యావన్‌ను సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో మాటువేసి మట్టుబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దారుణంలో యువతి బావ, సోదరుడితో పాటు మొత్తం 8 మంది పాలుపంచుకున్నట్లు సమాచారం. హత్య అనంతరం యువతి బావ స్నాప్‌చాట్‌లో ‘ఫుల్ మర్డర్’ అంటూ పోస్టు పెట్టి తన క్రూరత్వాన్ని బయటపెట్టడం గమనార్హం. గురువారం సాయంత్రం తెలిసిన యువకుడు వచ్చి పిలుచుకు వెళ్లిన తర్వాతే ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బాధితుల ఆందోళన.. ఉద్రిక్తత
తమ కొడుకును పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి తండ్రి శ్రీనివాస్, బంధువులు శుక్రవారం నిందితుల ఇంటి ముందు భారీ ఆందోళన చేపట్టారు. దీంతో ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులు దర్జాగా ఏసీల్లో ఉంటున్నారని, ప్రాణాలు తీసిన వారిని తమకు అప్పగించాలంటూ బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. నిందితులను వదిలే ప్రసక్తి లేదని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి బాధితులకు హామీ ఇవ్వడంతోపాటు ప్రస్తుతం అదుపులో ఉన్న ప్రధాన నిందితుడితో సహా నలుగురిని చూపించడంతో వారు ఆందోళన విరమించారు. మిగిలిన మరో నలుగురి కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు
18 కత్తిపోట్లు.. వేళ్లు తెగేలా దాడి
మరికొద్ది రోజుల్లో మూడో ఏడాది పరీక్షలు రాయాల్సిన తమ బిడ్డ విగతజీవిగా మారడంతో గాంధీ ఆసుపత్రి వద్ద యావన్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నిందితులు కత్తులతో దాడి చేస్తుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు యావన్ అడ్డుపెట్టిన చేతులు, వేళ్లు తెగిపోయి వేలాడుతున్న స్థితిని చూసి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. యావన్ శరీరంపై ఏకంగా 18 కత్తిపోట్లు ఉన్నాయంటే ఈ ఘాతుకం ఎంత కిరాతకంగా జరిగిందో అర్థమవుతోంది. గాంధీలో పోస్టుమార్టం అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య యావన్ మృతదేహాన్ని సీతాఫల్‌మండిలోని నివాసానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిలకలగూడ, నామాలగుండు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
వైరల్‌గా మారిన ఆడియో కాల్
హత్యకు ముందు యావన్, అతడు ప్రేమించిన యువతి మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘నా బావ నీపై కోపంగా ఉన్నాడు.. మన ఇద్దరినీ చంపుతానని బెదిరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు’’ అని యువతి హెచ్చరించడం ఆ సంభాషణలో స్పష్టంగా ఉంది. యువతి తండ్రి, బావ, సోదరుడు కొంతకాలంగా యావన్‌పై కక్ష పెంచుకోవడమే ఈ హత్యకు దారితీసిందని తెలుస్తోంది.
