వెన్నునొప్పితో బాధపడుతున్న యువతి శరీరంలో బుల్లెట్

వెన్నునొప్పితో బాధపడుతున్న యువతి శరీరంలో బుల్లెట్

వెన్ను నొప్పితో బాధపడుతూ సర్జరీ కోసం ఆసుపత్రికి వచ్చిన యువతి శరీరంలో ఉన్న బుల్లెట్ ని చూసి అటు డాక్టర్లు, ఇటు పోలీసులు షాకయ్యారు. డాక్టర్లు సర్జరీ చేసి శరీరం నుంచి బుల్లెట్ వేరు చేసి డిశ్చార్జ్ చేయగా.. పోలీసులు మాత్రం అసలు ఆ యువతి శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై ఎంక్వయిరీ చేపట్టారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. రెండు సంవత్సరాల నుంచి యువతి శరీరంలో బుల్లెట్ వల్ల ఇబ్బంది పడుతుందని, స్థానికంగా వైద్యం తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని సీఐ వెల్లడించారు. కాగా యువతి శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, నిమ్స్ వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన 18 ఏళ్ల అస్మా బేగం…వెన్నునొప్పితో ఈనెల 21న పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేరింది. తాను రెండు నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్నానంటూ ఆ యువతి వైద్యులకు చెప్పడంతో డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. అదే రోజు మధ్యాహ్నం వెన్ను నొప్పికి సంబంధించిన ఎక్స్‌రే తీయడంతో .. అందులో బుల్లెట్‌ ఉన్నట్లు గుర్తించారు.

అసలు శరీరం బుల్లెట్‌ ఎలా వెళ్లిందని?, ఎవరైనా తుపాకితో కాల్చారా?, ఒకవేళ కాల్చితే వారు ఎవరు? అని  డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆ యువతి ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో నిమ్స్ వైద్యులు పంజాగుట్ట పోలీస్ లకు పిర్యాదు చేసారు. ఈ నెల 22 న ఆ యువతి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.

వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పంజాగుట్ట ఇన్స్ పెక్టర్ కరుణాకర్ రెడ్డి యువతిపై కేసు నమోదు చేశారు. యువతి కుటుంబ నేపథ్యం పై కూడా తాము విచారణ జరుపుతున్నామని శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై ఇప్పటికే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు  ఆయన  పేర్కొన్నారు.