ఉపాధి కల్పించినా దొంగ బుద్ధి మారలే

ఉపాధి కల్పించినా దొంగ బుద్ధి మారలే
  • స్టేషన్ ముందే టిఫిన్ సెంటర్ పెట్టించిన ఉప్పల్ పోలీసులు
  • రెండేండ్లు నడిపించి.. మళ్లీ చోరీలు
  • దొంగతనం చేసి తప్పించుకునేందుకు సినిమా ట్రిక్​లు
  • చివరికి చోరీ చేస్తూ మళ్లీ దొరికిన పాత నేరస్తుడు
  • అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలింపు
  • కేసు వివరాలు వెల్లడించిస డీసీపీ పద్మజ

ఉప్పల్, వెలుగు: రెండొందలకు పైగా చోరీలు చేసిన నిందితుడికి ఉపాధి కల్పిస్తే మారుతాడని ఉప్పల్ పోలీసులు భావించారు. పోలీస్ స్టేషన్ ముందే టిఫిన్ సెంటర్ పెట్టించారు. రెండేండ్లు టిఫిన్ సెంటర్ నడిపించిన సదరు నిందితుడు.. తన బుద్ధి మార్చుకోలేదు. పోలీసుల కండ్లుగప్పి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. చోరీలు చేశాక పోలీసులకు దొరక్కుండా ఉండాలంటే ఏం చేయాలో సినిమాలు చూసి నేర్చుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి మళ్లీ జైలు పాలయ్యాడు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉప్పల్ పోలీస్ స్టేషన్​లో మల్కాజిగిరి డీసీపీ పద్మజ సోమవారం వెల్లడించారు. వరుస దొంగతనాలు చేస్తూ 2021లో పట్టుబడిన యాభై ఏండ్ల వెంకట రమణను పోలీసులు మార్చాలనుకున్నారు. ఉపాధి కల్పిస్తే చోరీలు మానేస్తాడని భావించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందే టిఫిన్ సెంటర్ పెట్టించారు. రెండేండ్ల వరకు నిందితుడు వెంకట రమణ టిఫిన్ సెంటర్ ను బాగానే నడిపించాడు. ఆ తర్వాత పోలీసుల కండ్లు కప్పి చోరీలు చేయడం ప్రారంభించాడు. రాచకొండ కమిషనరేట్ ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. అటు పోలీసులకు, ఇటు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.

తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. సీసీ కెమెరాలు ఉంటే దివ్యాంగుడిలా(కుంటుకుంటూ) నటిస్తూ చోరీలకు పాల్పడేవాడు. దొంగను పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ టీవీ ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా నడుస్తున్న వ్యక్తిని దొంగగా అనుమానించారు. అతన్ని పట్టుకుని ఎంక్వైరీ చేయగా.. పాత నేరస్తుడు వెంకట రమణగా గుర్తించారు.

ఇంటరాగేషన్​లో తాను చేసిన చోరీల గురించి చెప్పాడు. నిందితుడి దగ్గరి నుంచి 21 తులాల బంగారం, కిలో వెండి, రూ.1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ, కోదాడ, సిద్దిపేట, పోచారం ఐటీ కారిడార్, ఘట్​కేసర్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చోరీలు చేస్తుండేవాడు. టోపీ, మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకుని, కుడి కాలితో కుంటుకుంటూ (దివ్యాంగుడిలా నటిస్తూ) చోరీలు చేసేవాడు. చివరికి ఆదివారం పోలీసులకు చిక్కగా.. అరెస్ట్ చేసినట్టు డీసీపీ పద్మజ తెలిపారు.