రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా వారణాసి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ఇప్పటికే చెప్పేసింది. షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా ఉంటాడనే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ క్రేజ్ ఎంత వరకూ వెళ్లిందంటే.. గుంటూరు మైత్రీ సినిమాస్లో మహేష్ శ్రీరాముడి లుక్ థియేటర్ లోపల పిల్లర్పై కనిపించింది.
అంతే.. ఇంటర్నెట్ మొత్తం ఈ పిక్ ప్రస్తుతం ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా నుంచి మహేష్ బాబు శ్రీరాముడి లుక్ను అఫిషియల్గా ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. అసలు రిలీజ్ చేస్తారో లేక థియేటర్లోనే చూసేలా ప్లాన్ చేస్తారో కూడా తెలియదు. కానీ.. AIలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ మాత్రం ఇంటర్నెట్ను షేక్ చేస్తుండటం విశేషం. మహేష్ బాబు అభిమానులు ఈ లుక్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. వారణాసి సినిమా లాంచింగ్ ఈవెంట్లో రాముడిగా మహేష్ లుక్ గురించి రాజమౌళి చెప్పిన మాటలను ఈ పోస్టర్ చూసిన మహేష్ అభిమానులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
రాముడిగా మహేష్ లుక్ పై రాజమౌళి ఏమన్నాడంటే..
‘‘మహేష్‌కు రాముడి గెటప్ వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్బంప్స్ వచ్చాయి. మహేష్ కొంటెగా ఉంటాడు.. కృష్ణుడికి కరెక్ట్ కానీ రాముడికి సెట్ అవుతాడో లేదోననే డౌట్, కచ్చితంగా సూట్ అవుతాడని నమ్మకం మధ్య ఊగిసలాడుతూ ఉండేవాడిని. షూటింగ్‌లో మాత్రం ఎలాంటి అనుమానం కలగలేదు.
రాముడిగా ఎవరూ ఊహించనంత అందంగా మహేష్ ఉంటాడు. రాముడిగా మహేష్ లుక్ చూసి ముచ్చటేసి ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకున్నా. ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో తీసేశా. రాముడిగా మహేష్ బాబు లుక్ అంత బాగా కుదిరింది. ఊహించనంత పరాక్రమంగా, ఊహించనంత దయార్ధ్ర హృదయంతో, ఊహించనంత కోపంగా ఉంటాడు. రాముడిగా అన్ని రసాలు పలికించాడు. ఈ ఎపిసోడ్ షూట్ చేసే విషయంలో నేను చాలా లక్కీ” అని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.
