కొలంబో: ఓవైపు న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ బలం.. మరోవైపు వైవిధ్యమైన పాక్ స్పిన్ త్రయం.. ఈ రెండింటి మధ్య టీ20 వరల్డ్ కప్ సూపర్–8 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (ఫిబ్రవరి 21) జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ మొదలైంది. వాస్తవంగా చెప్పాలంటే మెగా టోర్నీలో కివీస్ జట్టు తమ అసలైన ఆటను ఇంకా చూపెట్టలేదు.
ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్ మెరుపులు మినహా మిగతా వాళ్లు బ్యాట్లకు పెద్దగా పని చెప్పలేదు. గత నాలుగు మ్యాచ్‌ల్లో రచిన్ రవీంద్ర 72 రన్స్ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. కానీ గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, డారిల్ మిచెల్‌లాంటి స్టార్ హిట్టర్లు ఇంకా గాడిలో పడలేదు. ఇప్పుడు వీళ్లంతా పాక్ మ్యాచ్‌పై దృష్టి సారించారు. అయితే మెగా టోర్నీలో తొలిసారి కొలంబోలో ఆడుతుండటం కివీస్‌కు మైనస్‌గా మారింది.
బౌలింగ్‌లో ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్ తమ స్ట్రాటజీలను పునఃసమీక్షించుకోవాలి. నకిల్ బాల్, స్లో బౌన్సర్, లెగ్ కట్టర్ వంటి వైవిధ్యాలను ఎక్కువగా చూపెట్టాల్సి ఉంటుంది. స్పిన్నర్లు మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, రచిన్, ఫిలిప్స్‌పై ఒత్తిడి తగ్గించడం చాలా ముఖ్యం. మరోవైపు స్పిన్‌కు అనుకూలించే ప్రేమదాస పిచ్‌పై పాక్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడి ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం.
స్పిన్నర్లు ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, షాదాబా ఖాన్‌కు బాల్ లెంగ్త్, వేగంపై బాగా పట్టుంది. కాబట్టి కివీస్ బ్యాటర్లు షాట్ మేకింగ్‌లో తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే పాక్ బ్యాటింగ్ బలహీనతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాహిబ్జాద్ ఫర్హాన్, షాదాబ్ ఖాన్ మినహా మిగతా వారు ఇబ్బందిపడుతున్నారు. బాబర్ ఆజమ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఒకవేళ ఫఖర్ జమాన్‌ను తీసుకుంటే ఎవర్ని తప్పిస్తారో చూడాలి.
