సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే చాలు.. ఏ బ్యాంకైనా రెడ్ కార్పెట్ వేసి రమ్మని పిలిచి మరీ లోన్ ఇచ్చేస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ రియాలిటీలో పరిస్థితి మరోలా ఉంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉండి, గతంలో సకాలంలో బాకీలు చెల్లించిన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ.. అనేకమంది లోన్ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. స్కోర్ అనేది కేవలం ఒక ప్రాథమిక అర్హత మాత్రమేనని.. లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు మరిన్ని లోతైన అంశాలను పరిశీలిస్తాయని గుర్తించాలి. మీ స్కోర్ బాగున్నా లోన్ ఎందుకు రావడం లేదో.. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
ఆదాయం అప్పుల నిష్పత్తి:
క్రెడిట్ స్కోర్ 800 ఉన్నా సరే.. ఆదాయానికి మించి ఇప్పటికే అప్పులు ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి వెనుకాడతాయి. మీ నెలవారీ జీతంలో సగానికి పైగా మొత్తం ఇప్పటికే ఉన్న హోమ్ లోన్, కార్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐలకే పోతుంటే.. కొత్త అప్పులు తీసుకున్నా వాటిని తీర్చే సామర్థ్యం మీకు లేదని బ్యాంకులు భావిస్తాయి. దీనినే డెట్-టు-ఇన్కమ్ రేషియో అంటారు బ్యాంకింగ్ భాషలో.
ఎక్కువ సార్లు లోన్ అప్లికేషన్స్:
తక్కువ కాల వ్యవధిలోనే ఎక్కువసార్లు లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం ఆర్థిక అస్థిరతకు సంకేతంగా కనిపిస్తుంది. మీరు అప్లై చేసిన ప్రతిసారీ బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిశీలిస్తాయి. ఇలా పదేపదే ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఎంక్వయిరీలు జరగడం వల్ల మీరు అప్పుల కోసం తహతహలాడుతున్న కస్టమర్ల కేటగిరీలోకి వెళ్లిపోతారు. ఫలితంగా స్కోర్ బాగున్నా లోన్ రిజెక్షన్ జరుగుతుంది.
పనిచేస్తున్న కంపెనీ గుర్తింపు:
బ్యాంకులు కేవలం మీ సిబిల్ స్కోర్‌నే కాదు.. మీరు ఎక్కడ పని చేస్తున్నారు. ఎంత కాలంగా చేస్తున్నారు అనే అంశాలను కూడా చూస్తాయి. తరచూ ఉద్యోగాలు మారడం, ప్రస్తుత కంపెనీలో ప్రొబేషన్ పీరియడ్‌లో ఉండటం లేదా కంపెనీ బ్యాంకుల అప్రూవ్డ్ లిస్ట్ లో లేకపోవడం వంటివి లోన్ రిజెక్షన్‌కు దారితీస్తాయి. స్థిరమైన ఆదాయం, నమ్మకమైన సంస్థలో పని చేయడం లోన్ రావడానికి కీలకమని గుర్తుంచుకోండి.
►ALSO READ | మీకో దండం.. మీ దేశానికో దండం : పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయిన 125 కంపెనీలు
డాక్యుమెంటేషన్.. రిపోర్ట్ రిమార్క్స్:
ఐడీ ప్రూఫ్స్, అడ్రస్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రాల్లో చిన్న తేడాలు ఉన్నా అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. అలాగే మీ క్రెడిట్ రిపోర్టులో పాత అప్పుల విషయంలో 'Settled' అని ఉంటే అది నెగటివ్ మార్కుగా మారుతుంది. లోన్ పూర్తిగా కట్టేసి 'Closed' అని ఉంటేనే అది మంచి రిపోర్ట్. లేట్ పేమెంట్స్ లేదా వడ్డీ తగ్గింపు కోసం చేసిన రిక్వెస్టులు కూడా రిపోర్టులో రిమార్క్స్‌గా మిగిలిపోతాయి.
తక్కువ క్రెడిట్ హిస్టరీ:
కేవలం ఒకే రకమైన క్రెడిట్ కార్డ్ లేదా లోన్ వాడటం కంటే.. సెక్యూర్డ్ హోమ్ లోన్, అన్-సెక్యూర్డ్ పర్సనల్ లోన్ అప్పుల కలయిక ఉండటాన్ని బ్యాంకులు ఇష్టపడతాయి. తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి కూడా బ్యాంకులు పెద్ద మొత్తంలో లోన్ ఇవ్వడానికి సాహసించవు.
లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి..?
ఒక సంస్థ లోన్ రిజెక్ట్ చేయగానే వెంటనే మరో బ్యాంకులో అప్లై చేయకండి. ముందుగా మీ క్రెడిట్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిదిద్దుకోండి. ఇప్పటికే ఉన్న అప్పులను కొంతమేర తగ్గించుకుని.. కనీసం 3 నుండి 6 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ తిరిగి ట్రై చేస్తే లోన్ రావటానికి చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక తప్పులు, పొరపాట్లను సరిచేసుకోకుండా ఎన్ని కంపెనీల చుట్టూ లోన్ కోసం తిరిగినా రిజెక్షన్ మాత్రమే ఎదురవుతుందని గుర్తుంచుకోండి.
