మీకో దండం.. మీ దేశానికో దండం : పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయిన 125 కంపెనీలు

మీకో దండం.. మీ దేశానికో దండం : పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయిన 125 కంపెనీలు

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరో భారీ షాక్ తగిలింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం అటుంచి.. ఇప్పటికే ఉన్న వ్యాపారాలను కొనసాగించడం కూడా భారంగా భావిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కట్టగట్టుకుని దాయాది దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయి. పాకిస్తాన్ కార్పొరేట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ విడుదల చేసిన తాజా జాబితా ఈ చేదు నిజాన్ని బయటపెట్టింది. జనవరి 20, 2026 నాటికి ఏకంగా 125 విదేశీ కంపెనీలు పాకిస్తాన్‌లో తమ కార్యకలాపాలను శాశ్వతంగా మూసివేశాయి. 

అన్ని రంగాల నుంచి ఎగ్జిట్..
పాకిస్తాన్ అబ్జర్వర్ నివేదిక ప్రకారం.. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్న బ్రాంచ్ ఆఫీసులు.. లైజన్ కార్యాలయాలను విదేశీ కంపెనీలు మూసివేశాయి. కేవలం ఒక్క దేశం నుంచే కాకుండా అమెరికా, బ్రిటన్, యూఏఈ, చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, టర్కీ, ఆస్ట్రేలియా, స్వీడన్, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన చాలా కంపెనీలు కూడా పాకిస్తాన్ నుంచి తరలి వెళ్లిపోతున్నాయి బిజినెస్ క్లోజ్ చేసుకుని. 

పాకిస్తాన్ వదిలి వెళ్లిన కంపెనీల జాబితాలో ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లు ఉండటం గమనార్హం. ఇంధన రంగ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ అనుబంధ సంస్థ తన వ్యాపారాన్ని మూసివేసింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన పానాసోనిక్, ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్ లైన్స్ కూడా తమ బోర్డులను తిప్పేశాయి. సాంకేతిక పరిజ్ఞానం, టెలికాం రంగం నుంచి డెల్ గ్లోబల్, నార్టెల్ నెట్వర్క్స్, టెలికార్డియా టెక్నాలజీస్ వంటి కంపెనీలు అక్కడి నుంచి సర్థుకున్నాయి. 

►ALSO READ | పాక్లో పెరుగుతున్న దారిద్ర్యం.. ఆరేండ్లలో 6.9 శాతం పెరుగుదల

ఆయిల్ అండ్ గ్యాస్ రంగం నుంచి హల్లీబుర్టా్న్ లిమిటెడ్, నిర్మాణ రంగంలో డూసన్ హెవీ ఇండస్ట్రీస్ కంపెనీలు వెనుదిరిగాయి. బ్యాంకింగ్ రంగంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. మార్షక్ బ్యాంక్. జైరాత్ బ్యాంకాసీ వంటి అంతర్జాతీయ బ్యాంకులు పాకిస్తాన్ కార్యకలాపాలను చాలించుకున్నాయి. కేవలం వ్యాపార సంస్థలే కాకుండా.. సామాజిక వాణిజ్య సేవలందించే అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్, పీస్ విండ్స్ జపాన్ వంటి ఎన్జీవోలు.. వాణిజ్య సంస్థలు కూడా తమ ఆఫీసులను మూసివేసిన లిస్టులో చేరిపోయాయి. 

ఈ దుస్థితికి కారణం ఏంటంటే..?
ఈ కంపెనీలు పాకిస్థాన్ నుంచి ఎందుకు వెళ్లిపోయాయనే విషయమై SECP స్పష్టమైన కారణాలను వెల్లడించలేదు. కానీ పాకిస్తాన్‌లోని అస్థిరమైన ఆర్థిక పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత, రాజకీయ అనిశ్చితి వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు అక్కడ ఉండటానికి భయపడుతున్నారని తేలింది. విదేశీ కంపెనీలు ఒక దేశాన్ని విడిచి వెళ్లడం అనేది ఆ దేశ పెట్టుబడి వాతావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా డెల్, పానాసోనిక్, లుఫ్తాన్స వంటి బ్రాండ్లు తప్పుకోవడం పాకిస్తాన్ ప్రతిష్టను ప్రపంచ మార్కెట్‌లో దెబ్బతీస్తున్నాయని చెప్పుకోవచ్చు.