కాంగ్రెస్ లో ఏ కోటా లేదు..మెరిట్ కోటాలో పాసైతేనే పదవులు: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ లో ఏ కోటా లేదు..మెరిట్ కోటాలో పాసైతేనే పదవులు: సీఎం రేవంత్ రెడ్డి

 కాంగ్రెస్ లో  కష్టపడ్డ వాళ్లకే పదవులిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఏ కోటా లేదని.. మెరిట్ కోటాలో పాసైతేనే పదవులు వస్తాయని చెప్పారు రేవంత్ .వికారాబాద్ జిల్లా హరిత్ రిసార్ట్ లో డీసీసీలకు ట్రైనింగ్ క్లాసులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. కాంగ్రెస్ సుదీర్గకాలంగా ప్రజలకు సేవలందిస్తోందన్నారు. వందేండ్లు పూర్తి చేసుకున్న పార్టీలు  కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీలే అని అన్నారు. 

‘ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది. ఈ దేశం యొక్క ఆత్మ కాంగ్రెస్. దేశం కోసం రాహుల్ ఫ్యామిలీ  ప్రాణ త్యాగాలు చేసింది. ప్రాణ త్యాగాలు చేసిన ఫ్యామిలీకి ఆస్తులు అవసరమా.? రాహుల్ కు ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. రాహుల్ ఫ్యామిలీ ఉన్నంత వరకు  దేశం ఐక్యంగా ఉంటుంది. 

 10 రోజుల శిక్షణ మీకు శిక్ష కాదు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే కార్యక్రమం ఈ ట్రైనింగ్. ఇక్కడ ఉన్నవాళ్లకు ఎవరికీ వారసత్వంగా పదవులు రాలేదు.  ఏపీ కాంగ్రెస్ చీఫ్  గా షర్మిల కొట్లాడుతుంది. షర్మిల వారసత్వంగా పదవులు ఎప్పుడు తీసుకోలేదు.  ప్రజల మద్దతుతోనే షర్మిల పదవులు కావాలని కోరుకుంది. షర్మిల ఆలోచనలను డీసీసీలు స్ఫూర్తిగా తీసుకోవాలి. పైరవీలు కాదు ప్రజా సమస్యలపై డీసీసీలు పోరాడాలి. పైరవీలు చేయకపోతేనే డీసీసీలకు గౌరవం ఉంటుంది.

►ALSO READ | డీసీసీలకు ట్రైనింగ్.. వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి

కుటుంబ చరిత్ర ఉన్నా 150 రోజులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. డీసీసీ పదవి చాలా విలువైనది. ఈ పదవితో ప్రజల్లోకి వెళ్లే మీకు మంచి భవిష్యత్ ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మాదే ప్రజాస్వామ్యం అనుకుంటే ఇక్కడి నుంచే ఫెయిల్ అవుతుంది. నేను పీసీసీ చీఫ్  అయ్యాక ప్రతీ నాయకుడిని కలిశా. నేతల ఆలోచనల్లో మార్పు వచ్చింది.  అందరం కలిసి పనిచేస్తే రెండున్నరేళ్లలో  అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి రాగానే కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చాం. 67 మందికి కార్పొరేషన్ పదవులు  ఇచ్చాం . ఇక నుంచి కష్టపడ్డవారికే పదవులిస్తాం. డీసీసీలకు పనిచేసే వాళ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం.

 30 ఏండ్లు  బ్రిటీష్  సర్కార్ పై గాందీ పోరాడారు. ఆనాడు బ్రిటీష్  సర్కారే గాంధీపై లాటీ ఎత్తడానికి ధైర్యం చేయలేదు. కానీ స్వాతంత్రం వచ్చాక గాంధీని ఓ పార్టీ అనుబంధ సంస్థ చంపేసింది. తెలంగాణలో 60 రోజుల్లో 42 లక్షల మెంబర్ షిప్ జరిగింది.  అత్యధిక మెంబర్ షిప్ చేసిన వాళ్లను గౌరవించాం.ఇకపై డిజిటల్ మెంబర్ షిఫ్ చేయాలి. ’ అని రేవంత్ అన్నారు.