Smriti Mandhana: 6 ఏళ్ల తర్వాత తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న స్మృతి మంధాన..

Smriti Mandhana: 6 ఏళ్ల తర్వాత తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న స్మృతి మంధాన..

Smriti Mandhana: భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి తన క్లాస్ బ్యాటింగ్ చూపించింది. ఈరోజు (ఫిబ్రవరి 21) అడిలైడ్ లోని ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయింది.  నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 176/6 అనే స్కోర్ చేయడంలో మంధాన కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. రెండో వికెట్‌కు జెమిమాహ్ రోడ్రిగస్ తో కలిసి 82 బంతుల్లో 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జెమిమా (59) సైతం హాఫ్ సెంచరీ చేసింది.

ఈ ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన తన కెరీర్‌లో 33వ టీ20 అంతర్జాతీయ అర్ధశతకం నమోదు చేసుకుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో భారత బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా ఆరేళ్ల రికార్డును కూడా చెరిపేసింది. గతంలో ఆమె 2020లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 37 బంతుల్లో 66 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి నయా చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో, ఆస్ట్రేలియాపై మంధానకు ఇది 8వ 50 ప్లస్ స్కోర్ కావడం విశేషం. ఈ విషయంలో కూడా ఆమె టీమిండియా బ్యాటర్‌గా నెంబర్ స్థానంలో కొనసాగుతోంది.

►ALSO READ | కోచ్ అవతారమెత్తిన గిల్: గూగుల్ సీఈవోకి భారత కెప్టెన్ క్రికెట్ పాఠాలు

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ప్రారంభంలో నాలుగో బంతికి బౌండరీతో ఖాతా తెరిచిన స్మృతి, మూడో ఓవర్‌లో షఫాలి వర్మ (7) వికెట్ పడిన తర్వాత పవర్‌ప్లే చివరి ఓవర్‌ వేసిన సోఫీ మోలినెక్స్ బౌలింగ్ లో మంధాన 3 ఫోర్లు కొట్టి బ్యాటింగ్ లో వేగం పెంచింది. జస్ట్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆమె, ఆ తర్వాత గేర్ మార్చి సెంచరీ దిశగా దూసుకెళ్లింది. చివరకు అన్నాబెల్ సదర్లాండ్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ వద్ద క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయింది. ఇక మంధాన–జెమిమా భాగస్వామ్యంతో భారత్ ఈ కీలక మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించగలిగింది.