యూసీసీ కచ్చితంగా అమలు చేస్తం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

యూసీసీ కచ్చితంగా అమలు చేస్తం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

ముషీరాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తు, అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను ఉత్తరాఖండ్  సీఎం పుష్కర్  సింగ్  ధామి కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తాను ప్రచారం చేశానని, ప్రధాని మోదీ మళ్లీ అధికారం చేపట్టాలన్న ఆకాంక్ష దేశ ప్రజలలో బాగా పెరిగిందని ఆయన చెప్పారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. యునిఫాం సివిల్  కోడ్ (యూసీసీ) కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ లో ఆమోదించామని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో బీజేవైఎం నగర అధ్యక్షుడు మద్దూరి శివాజీ అధ్యక్షతన బీజేవైఎం యువ సమ్మేళనం జరిగింది. 

ఈ కార్యక్రమానికి పుష్కర్  సింగ్  ధామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్  కె.లక్ష్మణ్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ధామి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్  రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు. తెలంగాణలో కారు షెడ్డులో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కమల వికాసం కొనసాగుతున్నదని, తెలంగాణలోని అన్ని లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కిషన్  రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం బీజేపీకి మళ్లీ అధికారం ఇవ్వాలన్నారు. ఈనెల 13న పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయాలని కోరారు. గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. 

దేశమంతా యూసీసీ అమలు కోసం ఎదురుచూస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్  అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక కచ్చితంగా యూసీసీ అమలుచేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. భారత నిర్మాణంలో యువత కీలకంగా మారనున్నారని, యువత పెద్ద సంఖ్యలో  బీజేపీకి ఓటు వేయాలని కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన ప్రచార సభలోనూ పుష్కర్​​సింగ్​ పాల్గొన్నారు.