ఎన్నారైలు కాంగ్రెస్‍కు మద్దతు ఇవ్వాలి: ఆరతి కృష్ణన్

ఎన్నారైలు కాంగ్రెస్‍కు మద్దతు ఇవ్వాలి: ఆరతి కృష్ణన్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో ఎన్నారైలంతా కాంగ్రెస్​పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్​చార్జి ఆరతి కృష్ణన్ పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం చాలా మంది వస్తున్నారని, వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సోమవారం గాంధీభవన్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పనిచేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన గ్యారంటీలను అమలుచేస్తోందన్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఎన్నారై సమస్యలపై ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని తాము కోరామని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 10 నుంచి12  ఎంపీ సీట్లు రావడం ఖాయమన్నారు.

బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తరు

కేంద్రంలో బీజేపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారని, రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఇండియన్ ఓవర్సీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సామల ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మోసకారి అని, ప్రజల్ని చైతన్య పరిచేందుకే తామిక్కడికి వచ్చామని చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్  కాంగ్రెస్ ప్రతినిధి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా టైంలోనూ తాము పనిచేశామని, రైతు సమస్యలపై పోరాటం చేశామని గుర్తుచేశారు. బీజేపీ అంటేనే మోసం, అబద్ధాలు అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీ టీంను ఓడించాం.. ఇప్పుడు ఏ టీమ్ ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ ఓవర్సీస్  కాంగ్రెస్ ప్రతినిధి గంప వేణుగోపాల్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ తీసుకువస్తే.. బీజేపీ ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు.