బైక్ స్పేర్ పార్ట్స్ గోదాంలో అగ్నిప్రమాదం..    రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన

బైక్ స్పేర్ పార్ట్స్ గోదాంలో అగ్నిప్రమాదం..    రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల – శంకర్ పల్లి ప్రధాన రహదారిపై ఉన్న రిషిత్ ఆటో మోటివ్స్ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గోదాంలో నిల్వ ఉంచిన హీరో బైకుల స్పేర్ పార్ట్స్, ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

స్థానికుల సమాచారంతో ఉదయం 5 గంటలకే రంగంలోకి దిగిన 10 మంది అగ్నిమాపక సిబ్బంది, దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాంలో భారీగా ప్లాస్టిక్, రబ్బరు, ఇంధన సంబంధిత సామగ్రి ఉండటంతో మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయని ఫైర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో సుమారు రూ. 3.5 కోట్ల విలువైన స్టాక్ కాలిపోగా, మరో రూ. 1.5 కోట్ల మేర బిల్డింగ్ డ్యామేజ్ జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. గోదాంలో ఐదుగురు సిబ్బంది పనిచేస్తుండగా ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు.