- నంబర్ ప్లేట్‌ను లోపలికి మలిచిపెట్టేలా ఏర్పాటు
గచ్చిబౌలి, వెలుగు: ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు కొత్త కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. శనివారం ఐటీ కారిడార్‌లో వాహనాల తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు ఓ బైకర్ చేసిన మాయాజాలం చూసి ఆశ్చర్యపోయారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలో ఆదివారం ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైనిక్‌పురికి చెందిన కమ్రాన్(28) డ్యూక్ బైక్ ను ఆపి పరిశీలించారు. బైక్ ముందు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వెనుక భాగాన్ని పరిశీలించగా నంబర్ ప్లేట్‌కు మ్యాగ్నెట్ అమర్చి ఉంది. నంబర్‌ప్లేట్‌ను లోపలికి మలిస్తే అది పైన అతుక్కునేలా దీనిని ఏర్పాటు చేశాడు. సీటుపై కూర్చుని నంబర్ ప్లేట్‌ను హ్యాండిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జరిమానాలు తప్పించుకునేందుకు ఇలా ఎత్తుగడ వేయడంతో పోలీసులు ఖంగు తిన్నారు. బైక్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

