V6 News

ఒక్క కోతిని పట్టుకుంటే రూ. 600 : మహారాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఒక్క కోతిని పట్టుకుంటే రూ. 600 : మహారాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్!

పెరుగుతున్న మానవ-కోతి సంఘర్షణలను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని చేపట్టింది. జనావాసాల్లోకి వచ్చే కోతులను సురక్షితంగా పట్టుకుని, అడవుల్లో విడిచిపెట్టే వారికి ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అంటే నగదు బహుమతి కింద ఒక్కో కోతిని పట్టుకున్నందుకు ప్రభుత్వం రూ. 600 ఇవ్వనుంది.
 
 కోతులను పట్టుకోవడం ప్రమాదంతో కూడుకున్న పని కాబట్టి, ఈ పని చేసే వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచాలని చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణాల్లో పంటలను, ఆస్తులను నష్టం చేస్తున్న రీసస్ మకాక్‌లు అనే సాధారణ కోతులు, హనుమాన్ లంగూర్‌లను అంటే కొండముచ్చులు పట్టుకునేందుకు  ఈ చర్యలు చేపట్టారు.

నిబంధనలు, మార్గదర్శకాలు:
కోతులను పట్టుకునే ప్రక్రియలో వాటికి ఎటువంటి హాని కలగకూడదని ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టింది. కోతులను పట్టుకోవడానికి కేవలం వలలు లేదా బోనులు వంటి సురక్షితమైన పద్ధతులు మాత్రమే వాడాలి అని సుచించింది. ప్రతి ఆపరేషన్‌ను ఫోటోలు లేదా వీడియోల ఆధారాల ద్వారా రికార్డు చేయాలి. పట్టుకున్న కోతులను తిరిగి ఊర్లోకి రాకుండా, జనావాసాలకు కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోకి తరలించి విడిచిపెట్టాలి. 

అడవులు తగ్గిపోవడం, పట్టణాల్లో చెత్త కుప్పల వద్ద ఆహారం ఈజీగా దొరుకుతుండటంతో కోతులు ఊళ్ల మీదకు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. దీనివల్ల పంటలు నాశనం అవ్వడమే కాకుండా, మనుషులపై దాడులు కూడా జరుగుతున్నాయి.

జంతువులను హింసించకుండా, అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూనే ప్రజలకు కోతుల భయం నుండి ఉపశమనం కలిగించేందుకే ప్రభుత్వం ఈ  కార్యక్రమం చేపట్టింది.