V6 News

BRS చచ్చిన శవం.. రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని: కవిత పార్టీపై సీఎం రేవంత్ రియాక్షన్

BRS చచ్చిన శవం.. రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని: కవిత పార్టీపై సీఎం రేవంత్ రియాక్షన్

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం (ఏప్రిల్ 27) అసెంబ్లీ ప్రాంగణంలో విలేకర్లతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత పార్టీ ఏర్పాటు గురించి మీడియా ప్రతినిధులు సీఎం రేవంత్‎ను ప్రశ్నించగా.. ప్రస్తుతం ఉన్న పార్టీకే దిక్కు లేదు.. రాష్ట్రంలో ఇంకా కొత్త పార్టీకి ఏం పని అని పరోక్షంగా స్పందించారు. ఇప్పుడు ఉన్న పార్టీనే ఉంటుందా పోతుందా తెల్వదని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో తలెత్తిన పంపకాల గొడవ మాపై రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వారసత్వ సంపద కోసమే ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత కొట్లాడుకుంటున్నారని అన్నారు. 

బీఆర్ఎస్ చచ్చిన శవం

పర్పస్ సాల్వ్ అయ్యాక ఏ సిస్టమ్ అయినా డిసాల్వ్ అవుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ పర్పస్ కూడా సాల్వ్ అయింది ఇక ఆ పార్టీ మనుగడలో లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక చచ్చినా శవం లాంటింది.. చనిపోయిన శవానికి వైద్యం చేసినా వృధా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ గతం.. ఆ పార్టీకి ఇక భవిష్యత్ ఉండదని అన్నారు. 

పదేళ్లు అధికారం అడ్డం పెట్టుకుని అహంకారంతో పని చేశారు.. కానీ అప్పట్లో ప్రజలు చూసిచూడనట్లు వదిలేశారు. ఇక, కుటుంబ పార్టీతో అవసరం లేదని ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారన్నారు. కేసీఆర్‎కు తెలంగాణ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి.. కుటుంబ అవసరాల కోసమే ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. 

కేసీఆర్ చావును మేం ఎప్పుడూ కోరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కేసీఆర్ ఆస్పత్రిలో చేరితే మొదట కలసి వచ్చింది తానేనని గుర్తు చేశారు. కేసీఆర్ చనిపోతే నాకేం వస్తది.. ఆయన ఆస్తులు,  ఫార్మ్ హౌజ్ నాకు రావు కదా అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ ఉండగానే బాహాటంగా కేటీఆర్ సీఎం అని పార్టీలో చర్చ మొదలు పెట్టారన్నారు. 

కేసీఆర్ వారసత్వ సంపద కోసం ఆయన కొడుకు, బిడ్డ కొట్లాడుకుంటున్నారన్నారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాపతినిధి అని.. ఆయన కాంగ్రెస్‎కు పోటీ కాదన్నారు. కేసీఆర్‎కు ఓటమి కొత్త కాదు కాంగ్రెస్‎కు గెలుపు కొత్త కాదని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లో్జ్ అని.. స్టేట్ పాలిటిక్స్ లో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు.