సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్.. మరోసారి తమిళ రాజకీయాల్లో చర్చకు వచ్చారు. ఆయన కారును చెన్నైలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో తమిళనాట హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన ఏప్రిల్ 26న చెన్నైలోని కొట్టివక్కం ప్రాంతంలో జరిగినట్లుగా సమాచారం.
రెస్టారెంట్‌కు వెళ్లి తిరిగివచ్చేసరికి, పార్క్ చేసిన తన కార్ అద్దాన్ని పగలగొట్టబడినట్లు ఆయన గుర్తించారు. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, వీడియోను పంచుకున్నారు. “ఇది అల్లరి మూకల పని లేదా ఉద్దేశపూర్వకంగా చేసినదో తెలియదు. నేను రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇది జరిగింది” అని పేర్కొన్నారు.
అలాగే, ఇది హీరో దళపతి విజయ్ అభిమానుల పని అయి ఉండొచ్చని పరోక్షంగా వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. అయితే, విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని జేమ్స్ వసంతన్ తరచూ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, జేమ్స్ వసంతన్ 2008లో విడుదలైన సుబ్రమణ్యపురం చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన దళం సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకి ఆర్జీవీ శిష్యుడు బి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

