షాహీన్​బాగ్​లో సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలు

షాహీన్​బాగ్​లో సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలు

షాహీన్​బాగ్​లో ప్రొటెస్టులు  ఆగలే

    కొనసాగిన సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలు

    అటు ‘ఆజాదీ’..  ఇటు ‘గోలీ మారో’ స్లోగన్లు

    భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు, పారామిలటరీ ఫోర్స్

   ఐడీ ప్రూఫ్ లేకుండా షాహీన్​బాగ్​లోకి నో పర్మిషన్

ఢిల్లీలోని షాహీన్​బాగ్​లో సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్ (సీఏఏ)​కు వ్యతిరేకంగా, అనుకూలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం భారీ సంఖ్యలో స్థానికులు, నిరసనకారులు అక్కడ ఆందోళనలు చేపట్టారు. కొందరు ప్రొటెస్టర్లు ఆజాదీ నినాదాలు చేయగా.. మరికొందరు ‘గోలీ మారో’ అంటూ స్లోగన్లు ఇచ్చారు. వందేమాతరం పాడారు. వందలాది స్థానిక మహిళలు రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. శనివారం జరిగిన కాల్పుల ఘటనను లెక్కచేయని ఆందోళనకారులు.. సీఏఏను విత్ డ్రా చేసుకునే వరకు షాహీన్​బాగ్​లో తమ ప్రొటెస్టులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు షాహీన్ బాగ్ నిరసనలకు వ్యతిరేకంగా కౌంటర్ ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పలు ప్రాంతాలకు తరలించారు. అయినా కొంతమంది నిరసనకారులు ఇప్పటికీ అక్కడ నినాదాలు కొనసాగిస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం..

పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. షాహీన్​బాగ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతోపాటు పారామిలటరీ ఫోర్సెస్ బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఐడీ ప్రూఫ్ చూపించిన వ్యక్తులనే ఆ ప్రాంతంలోకి పంపుతున్నారు. చెకింగ్ లేకుండా ఎలాంటి వెహికల్​కు అనుమతి ఇవ్వడం లేదు. సౌత్ రేంజ్ జాయింట్ కమిషనర్ దేవేశ్ శ్రీవాస్తవ, సౌత్ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ సహా సీనియర్ అధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వెనక్కి తగ్గిన హిందూ సేన!

సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని షాహీన్ బాగ్ నుంచి ఆదివారం తామే పంపించేస్తామని హెచ్చరించిన హిందూసేన వెనక్కి తగ్గింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చిన్మోయ్ బిస్వాల్, సీనియర్ ఆఫీసర్లతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా చెప్పారు. అంతకుముందు ఫిబ్రవరి 2 (ఆదివారం) ఉదయం 11 గంటలకు ‘షాహీన్ బాగ్ జిహాదీలను’ తామే తొలగిస్తామని ఓ ప్రెస్ రిలీజ్ లో హెచ్చరించారు.

‘షాహీన్​బాగ్’పై చర్చించేందుకు మీటింగ్

షాహీన్ బాగ్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు స్థానిక పోల్ అధికారులు, పోలీసులు సమావేశమయ్యారని ఆఫీసర్లు చెప్పారు. ‘‘షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్​లో శనివారం సాయంత్రం మీటింగ్ జరిగింది. అయితే కాల్పుల ఘటన వల్ల కొందరు అధికారులు హాజరుకాలేకపోయారు. దీంతో మేం సమావేశమై.. చర్చించాం” అని ఓక్లా నియోజకవర్గం పోల్ అధికారి ఒకరు చెప్పారు. అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి సమస్య లేదని చెప్పారు.

కాల్పులు జరిపిన వ్యక్తికి కస్టడీ

శనివారం షాహీన్​బాగ్​లో గాలిలోకి కాల్పులు జరిపిన నిందితుడు కపిల్ గుజ్జర్​ను రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్ విజేత్ సింగ్ రావత్ ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టాగా.. జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.