మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌‌కు బెదిరింపు రాతలు

మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌‌కు బెదిరింపు రాతలు

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రలో రైళ్లు, స్టేషన్లలో ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) చీఫ్​, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌పై బెదిరింపు రాతలు సంచలనం సృష్టించాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అయితే, ఈ రాతల వెనక బీజేపీ ఉందని ఆప్​ ఆరోపిస్తున్నది. పోలీసులు ఈ విషయం పట్టించుకోవడం లేదని విమర్శించింది. కేజ్రీవాల్ ప్రాణాలకు ప్రమాదం ఉందని.. ఆయన భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీ ఆరోపించింది. బెదిరింపు రాతలపై సమావేశం నిర్వహించేందుకు పర్మిషన్ కోరుతూ ఆప్ ఎన్నికల కమిషన్​కు ఇ–మెయిల్  ద్వారా రిప్రజెంటేషన్ పంపించింది.

బీజేపీ కుట్రలు పన్నుతున్నది

సోమవారం ఆప్​ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లను కోల్పోతుండడం బీజేపీని కలవరపెడుతున్నది. అందుకే కేజ్రీవాల్‌‌ను లక్ష్యంగా చేసుకొని పలు కుట్రలు పన్నుతున్నది. వారు ఆయన్ను మార్చి 21న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉంచినప్పుడు ఆయనకు 15 రోజులు ఇన్సులిన్‌‌ను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. మేం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాతి మలివాల్‌‌ను ప్రయోగించారు. కానీ ఆ కుట్ర బట్టబయలైంది.. దాడి అబద్ధమని వీడియోలు స్పష్టం చేశాయి. 

కేజ్రీవాల్ ప్రాణాలకు ప్రమాదం ఉంది. బెదిరింపు రాతలపై పోలీసులు ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు. రైళ్లు, స్టేషన్లు సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉన్నా ఎందుకీ నిర్లక్ష్యం” అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌‌దేవా ఆఫ్ విమర్శలను ఖండించారు. ప్రజల సానుభూతి పొందేందుకు, స్వాతి మలివాల్​పై దాడి నుంచి దృష్టి మళ్లించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ భద్రతను రెట్టింపు చేయాలని పోలీసులను కోరారు.