ఫేక్ న్యూస్‌‌పై సర్కార్ సీరియస్.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్

ఫేక్ న్యూస్‌‌పై  సర్కార్ సీరియస్.. సజ్జనార్ పర్యవేక్షణలో  సిట్
  • సీపీ సజ్జనార్పర్యవేక్షణలో8 మందితో ఏర్పాటు
  • మహిళా ఐఏఎస్, మంత్రి ఎపిసోడ్ సహా 
  • సీఎం ఫొటోల మార్ఫింగ్‌‌పై సర్కార్ సీరియస్ 
  • ఈ ఘటనల వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానం 
  • వీటిపై ఇప్పటికే కేసులు నమోదు 
  • నిజాలు నిగ్గుతేల్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం  
  • నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి 

హైదరాబాద్‌‌, వెలుగు:ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్‌‌ అంశాన్ని సర్కార్ సీరియస్‌‌గా తీసుకుంది. ఇటీవల ఓ మంత్రి, మహిళా ఐఏఎస్‌‌ను కించపరుస్తూ ప్రసారం చేసిన కథనాలతో పాటు సీఎం రేవంత్‌‌ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్‌‌ చేసిన ఘటనలపై ఆగ్రహంగా ఉన్నది. సీఎం, మంత్రి, మహిళా ఐఏఎస్ ప్రతిష్టను దిగజారుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటనల వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌‌ టీమ్‌‌ (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్‌‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌‌ ఇన్‌‌చార్జ్‌‌గా హైదరాబాద్‌‌ సిటీ నార్త్‌‌ రేంజ్‌‌ జాయింట్‌‌ సీపీ ఎన్‌‌.శ్వేతను నియమించగా... చేవెళ్ల డీసీపీ యోగేశ్‌‌ గౌతం, హైదరాబాద్‌‌ సిటీ అడ్మిన్‌‌ డీసీపీ కె.వెంకటలక్ష్మి, హైదరాబాద్‌‌ సిటీ సైబర్‌‌ క్రైమ్స్‌‌ డీసీపీ వి.అరవింద్‌‌ బాబు, విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ అడిషనల్‌‌ ఎస్పీ ప్రతాప్‌‌కుమార్‌‌, హైదరాబాద్‌‌ సిటీ సీసీఎస్‌‌ ఏసీపీ గురు రాఘవేంద్ర, సీఐ సెల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ శంకర్‌‌రెడ్డి, షీ సైబర్‌‌ సెల్‌‌ ఎస్సై హరీశ్‌‌ను సభ్యులుగా నియమించారు. 

రెండు ఘటనలపై కేసులు.. 

మహిళా ఐఏఎస్‌‌పై అసభ్యకర కథనాలను ప్రసారం చేసిన ఓ న్యూస్​ చానల్, వాటిని సర్క్యులేట్ ​చేసిన ఇతర​ చానళ్లు, వెబ్‌‌సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్‌‌ ఆఫీసర్స్‌‌ అసోసియేషన్‌‌ సెక్రటరీ, స్పెషల్ చీఫ్‌‌ సెక్రటరీ జయేశ్‌‌ రంజన్‌‌ హైదరాబాద్‌‌ సీసీఎస్‌‌లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రెండు శాటిలైట్‌‌‌‌ చానల్స్ సహా మరో ఏడు సోషల్‌‌‌‌ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌‌‌‌పై సీసీఎస్‌‌‌‌ పోలీసులు బీఎన్ఎస్‌‌‌‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు (ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 7/2026) నమోదు చేశారు. చానల్‌‌‌‌ యాజమాన్యంతో పాటు ఎడిటర్‌‌‌‌‌‌‌‌, రిపోర్టర్లు, యాంకర్లను నిందితులుగా చేర్చారు. ఇక నారాయణపేట్‌‌‌‌ జిల్లా కొత్తకొండకు చెందిన కావలి వెంకటేశ్‌‌‌‌ అనే వ్యక్తి సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌‌‌‌ చేసి తెలంగాణ పబ్లిక్‌‌‌‌ టీవీ వాట్సప్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లో సర్క్యులేట్​చేశాడు. దీనిపై గొల్ల నర్సింహా అనే కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు  మద్దూర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో (ఎఫ్ఐఆర్ నంబర్‌‌‌‌ 11/ 2026) ఈ నెల 11న ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల దర్యాప్తును సిట్‌‌‌‌కు అప్పగించామని, సమగ్ర దర్యాప్తు తర్వాత నివేదిక సమర్పిస్తారని డీజీపీ వెల్లడించారు. కాగా, తక్కువ సమయంలో మహిళా ఐఏఎస్‌‌‌‌ అధికారికి కీలక పోస్టింగులు దక్కాయంటూ ప్రసారం చేసిన కథనంతో పరిపాలన వ్యవస్థను అగౌరవపరిచనట్లేనని ప్రభుత్వం భావిస్తున్నది. అటు సీఎం ఫొటోలను మార్ఫింగ్​చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందని అనుమానిస్తున్నది. ఈ కారణంగానే ఈ రెండు కేసులను ప్రభుత్వం సిట్‌‌‌‌కు అప్పగించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.