నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై పార్టీల ఫోకస్.. టికెట్ల కోసం నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

 నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై పార్టీల ఫోకస్.. టికెట్ల కోసం నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
  • గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్​, బీజేపీ సర్వే
  • మీటింగ్​లతో మజ్లిస్​ బిజీ
  • పోటీదారుల కోసం బీఆర్​ఎస్​ వెతుకులాట

 నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​పై జెండా ఎగరేయాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫైనల్​ ఓటర్​ లిస్టు రిలీజయ్యింది. పోలింగ్​ సెంటర్ల లిస్ట్​ఫైనల్ అయిన తర్వాత డివిజన్లు, వార్డుల రిజర్వేషన్ చేపడతారు. నిజామాబాద్​ కార్పొరేషన్​పరిధిలో కాంగ్రెస్​టికెట్​లకు భారీగా డిమాండ్​ ఉంది.

ప్రతి డివిజన్​నుంచి ఐదారుగురు పోటీ పడుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని వారంతా తమకు అనుకూలంగా ఉండే లీడర్లను కోరుతున్నారు. అయితే .. సర్వే నిర్వహించి సమర్థుడినే బరిలో దింపాలని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. బీజేపీ కూడా అభ్యర్థులను సర్వే ద్వారానే ఖరారు చేయాలని నిర్ణయించింది. జిల్లాకు చెందిన మజ్లిస్ నేతలు హైదరాబాద్​లో అసదుద్దీన్​ ఓవైసీని కలిసొచ్చారు.

తమకు పట్టున్న ఏరియాల్లో మీటింగ్​లు నిర్వహిస్తూ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ పోటీదారుల కోసం వెతుకుతోంది. నిజామాబాద్​ మేయర్​ పదవి ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుతందోనన్న ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్​ ఎలావచ్చినా బల్దియాను కైవసం చేసుకోవాల్సిందేనని కాంగ్రెస్​, బీజేపీలు గట్టిగా భావిస్తున్నాయి. ఈ మేరకు బలమైన అభ్యర్థులను బరిలో నిలపేందుకు కసరత్తు చేస్తున్నాయి. 

నిజామాబాద్​ మున్సిపాలిటీ 2005లో కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ అయ్యింది. మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ కుమారుడు ధర్మపురి సంజయ్​ కాంగ్రెస్​ నుచంఇ మొదటి మేయర్​గా బాధ్యతలు తీసుకున్నారు. ఆతర్వాత పదేండ్లు బీఆర్​ఎస్​ మేయర్​ పదవిని దక్కించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్ నుంచి చాలా మంది చేరడంతో కాంగ్రెస్​ బలం పెరిగింది.

టీపీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​ గౌడ్​ సొంత జిల్లా కావడం, గవర్నమెంట్ సలహాదారు షబ్బీర్​అలీ నిజామాబాద్​ అర్బన్​ఇన్​చార్జిగా వ్యవహరిస్తుండడంతోకార్పొరేషన్​ ఎన్నికను కాంగ్రెస్​నేతలు సవాల్​గా తీసుకుంటున్నారు. కార్పొరేషన్​లో 60 డివిజన్లకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 28 డివిజన్లు గెలుచుకుంది. బీఆర్ఎస్​స్థానాల్లోనే గెలిచిన బీఆర్ఎస్​ 16 మంది మజ్లిస్ కార్పొరేటర్లు, ఐదుగురు ఎక్స్​ అఫిషియో మెంబర్ల మద్దతులో మేయర్​ పీఠాన్ని దక్కించుకుంది.

మెజారిటీ స్థానాలు గెలిచినా గతంలో మేయర్​ దక్కని బీజేపీ ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ప్లాన్​ చేస్తోంది. ఎంపీ అర్వింద్​ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గెలుపు గుర్రాల కోసం ఆర్వింద్​ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో కన్న ఎక్కువ స్థానాలు గెలిచి ఈ సారి కూడా మేయర్​ ఎన్నికల్లో చక్రం తప్పేందుకు మజ్లిస్​ప్రయత్నిస్తోంది. బీఆర్ ఎస్​ నుంచి పోటీ చేయడానికి పెద్దగా కార్యకర్తలు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఆపార్టీ నేతలు అభ్యర్థులకోసం వేట  మొదలుపెట్టారు.