సమ్మర్‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లాన్... నిజామాబాద్ జిల్లాలో చర్యలు చేపట్టిన ఎన్పీడీసీఎల్ అధికారులు

సమ్మర్‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లాన్... నిజామాబాద్ జిల్లాలో చర్యలు చేపట్టిన ఎన్పీడీసీఎల్ అధికారులు
  •     లోడ్‌‌‌‌‌‌‌‌ను తట్టుకునేలా 3 సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లలో అదనపు ట్రాన్స్​ఫార్మర్లు
  •     టౌన్లు, గ్రామాల్లో 188 ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంపు

కామారెడ్డి, వెలుగు : వేసవిలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం వ్యవసాయానికి కరెంట్​అందించేందుకు జిల్లాలో ఎన్పీడీసీఎల్ ( తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) అధికారులు చర్యలు చేపట్టారు. ఎండలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉండడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో 6 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగం 4.78 లక్షలు, వ్యవసాయానికి 1.10 లక్షలు, కమర్షియల్, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ తదితరాలు కలిపి మరో 12 వేల వరకు ఉన్నాయి. 

సాధారణంగా రోజుకు సగటున 4 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, సమ్మర్‌‌‌‌‌‌‌‌లో 5.3 మిలియన్ నుంచి 7 మిలియన్ యూనిట్ల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. గత ఏడాది మార్చి చివరిలో 7.5 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. ఈ ఏడాది మార్చి నెలకు జిల్లాకు 5.3 మిలియన్ యూనిట్ల కరెంట్ కేటాయించారు. జిల్లాలో 75 శాతం వ్యవసాయం బోర్లపై ఆధారపడడంతో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది.  

లోడ్‌‌‌‌‌‌‌‌ను తట్టుకునేలా ముందస్తు ప్రణాళిక..

ఎండలు పెరిగితే ఇండ్లు, షాపులు, వ్యవసాయానికి  కరెంట్​వాడకం పెరుగుతుంది. దీంతో సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, ట్రాన్స్​ఫార్మర్లపై లోడ్​పడి సాంకేతిక సమస్యలు తలెత్తనున్నాయి. సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో ముందస్తుగా ప్లాన్​ రూపొందించారు.  33/11 కేవీ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లలో మూడు చోట్ల పవర్ ట్రాన్స్​ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. 

లింగంపేట మండలం పోతాయిపల్లి సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 5 ఎంవీఎ ట్రాన్స్​ఫార్మర్‌‌‌‌‌‌‌‌కు అదనంగా మరో 5 ఎంవీఎ ట్రాన్స్​ఫార్మర్ ఏర్పాటు చేశారు. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 5 ఎంవీఎకు అదనంగా 3.1 ఎంవీఎ ట్రాన్స్​ఫార్మర్ బిగించారు. బిచ్​కుంద మండలం గుండెనెమ్లి సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం ఉన్న 5 ఎంవీఎకు అదనంగా 3.1 ఎంవీఎ ట్రాన్స్​ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ఏరియాల్లో లోడ్​ తట్టుకునే సామర్థ్యం పెరగనుంది. 

టౌన్లు, గ్రామాల్లో ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంపు..

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీ ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో 188 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే 95 పనులు పూర్తయ్యాయి. మిగతావి మార్చి నెలలో పూర్తి చేయనున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్​ఫార్మర్లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఆయా కాలనీలకు ఫీడర్లను ఏర్పాటు చేసేందుకు లైన్లు వేశారు. అశోక్‌‌‌‌‌‌‌‌నగర్, శ్రీరాంనగర్ కాలనీలకు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో కెపాసిటర్లు అమర్చారు. సమ్మర్‌‌‌‌‌‌‌‌లో లోడ్ ఎంత పెరిగినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు 
తెలిపారు. 

సమస్య లేకుండా సప్లయ్​ చేస్తాం

సమ్మర్‌‌‌‌‌‌‌‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా జిల్లావ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నాం. ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌’లో భాగంగా పలు పనులు పూర్తి చేశాం. ఇంకా కొన్ని ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంపు పనులు కొనసాగుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో పెరిగే లోడ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశాం.  - ఆర్​. రవీందర్​, ఎస్ఈ- ఎన్పీడీసీఎల్, కామారెడ్డి జిల్లా