నవీపేట్, వెలుగు : మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితపై విమర్శలు చేసిన వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని జాగృతి జిల్లా నాయకుడు దొంతు ప్రవీణ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. లిక్కర్ కేసులో ‘కడిగిన ముత్యం లా బయటకు వస్తా’ అని కవిత చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. కావాలని బీజేపీ నాయకులు కేసులో ఇరికించారని, అప్పట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారని పేర్కొన్నారు.
త్వరలో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున జాగృతిలో చేరడం ఖాయమన్నారు. సమావేశంలో జాగృతి మండలాధ్యక్షుడు పీతంబర్, యూత్ నాయకుడు డాన్ సాయి, మాజీ ఎంపీటీసీ జనార్దన్, మాజీ ఉపసర్పంచ్ నరహరి తదితరులు పాల్గొన్నారు.
