- కీలకం కానున్న మహిళా ఓటర్లు
- రిజర్వేషన్లు ఖరారు కాక ముందే ఇండ్లు, ప్లాట్లు తఖాట్టు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డులు, చైర్మన్ పదవుల రిజర్వేషన్లపై నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ కలిసొస్తే పోటీలో దిగేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు.
మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ఆశావాహులు ఉన్నారు. 2025 జనవరితో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోగా.. ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు, వార్డుల రిజర్వేషన్లు చర్చనీయాంశమైంది.
మహిళా ఓటర్లే అధికం
పట్టణాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. .నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీ లలో 303 వార్డులు ఉండగా 12 మున్సిపాలిటీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 18,259 మంది ఎక్కువగా ఉన్నారు.. వార్డుల వారీగా పరిశీలించినా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. గెలుపోటములు నిర్ణయించే శక్తి నిర్ణయించే మహిళా ఓటర్లపైనే ఉంది.
రెండేసి వార్డులపై గురి
వార్డులలో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఎక్కడ కలిసి వస్తే అక్కడే పోటీ అన్న ఆలోచనతో రెండు మూడు వార్డులపై దృష్టిపెట్టి పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటూ..మరో పక్క ఎన్నికల ఖర్చుల నిమిత్తం నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారు.
గత మున్సిపల్‌ఎన్నికల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌మున్సిపాలిటీల్లో ఒక్కో అభ్యర్థి రూ.20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేయగా నేరేడుచర్ల, తిరుమలగిరిలో రూ.20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు నాడు పోటీ చేసిన అభ్యర్థులే చెబుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మున్సిపాలిటీల్లో ఓటర్లకు రూ.1500 నుంచి 2వేల వరకు పంచినట్లు ప్రచారం జరగడంతో ఈ సారి మున్సిపల్‌ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు రూ.40 నుంచి 50 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఇప్పటికే ఆశావహులు నిధుల సోర్స్ చూసుకుంటూ ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు తాకట్టు పెట్టి అప్పుల కోసం తిరుగుతున్నారు. మరి నామినేషన్లు వేసి, ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఏం జరుగుతుందో.. పోటీలో నిలవాలనుకునే ఉత్సాహవంతులు ఎంత మందిని అదృష్టం వరిస్తుందో తెలియదు కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల్లో మాత్రం టెన్షన్‌మొదలైంది.
మున్సిపల్ చైర్మన్ సీటుపై గురి
మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను ఏ సామాజిక వర్గాలకు రిజర్వు చేస్తారనే చర్చ సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. ఈసారి కలిసొస్తే వార్డు కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్/చైర్పర్సన్ సీటుపై కూర్చోవాలని పలువురు దృష్టి సారించారు. ఈమేరకు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.
మరోపక్క వార్డుల రిజర్వేషన్లపై కూడా ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లను బట్టి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తమ వార్డులతో పాటు అతి సమీపంలో ఉండే వార్డుల్లో కులాల వారీగా జనాభా, ఓటర్ల సంఖ్యతో రిజర్వేషన్లపై చర్చిస్తూ రెండేసి వార్డులపై దృష్టి పెట్టి ఎక్కడ కలిసొస్తే అక్కడ నిలబడాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైర్మన్‌గా పోటీ చేయాలనుకునే కొంతమంది నిధులు సమకూర్చుకుంటూ తమను ముందుగా ప్రకటిస్తే ఖర్చుల సంగతి తామే చూసుకుంటామంటూ ఆయా రాజకీయ పార్టీల అధిష్టానాల వద్ద పైరవీలు చేసుకుంటున్నారు.
