కరీంనగర్ టౌన్, వెలుగు: భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ రూల్స్‌ను తప్పకుండా పాటించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సుడా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల వద్ద నవీకరించిన భూముల నిషేధిత జాబితా ఒకేరకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఈ జాబితా సబ్ రిజిస్ట్రార్, ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కొనుగోలు, అమ్మకందారులు భూముల రిజిస్ట్రేషన్ కు వెళ్లే ముందు తగిన సూచనలను తెలియజేస్తామని, ఈ మార్గదర్శకాలు కొనుగోలు, అమ్మకందారులు చదువుకునేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. అక్రమంగా ఉన్న హౌస్ నంబర్లు ఇప్పటికే రద్దు చేశామని, రిజిస్టర్ చేసే ముందు ఆ జాబితా రిజిస్ట్రార్ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
జపాన్ పర్యటనకు ఎంపికైన స్టూడెంట్‌కు అభినందన
కొత్తపల్లి, వెలుగు: జిల్లా, రాష్ట్ర స్థాయి సకుర సైన్స్ ప్రోగ్రామ్‌లో సత్తాచాటి జపాన్ పర్యటనకు ఎంపికైన ఎలగందుల్ మోడల్ స్కూల్ స్టూడెంట్ జి.శివాంజలిని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి నలుగురు మాత్రమే ఈ పర్యటనకు ఎంపికైనట్లు చెప్పారు. మే 24 నుంచి 30 వరకు జపాన్‌లో పర్యటించి అక్కడి పరిశ్రమలు, పరిశోధన సంస్థలను సందర్శించనున్నట్లు వెల్లడించారు.
అనంతరం రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి జాతీయ, సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైన మల్కాపూర్ జడ్పీ హైస్కూల్ స్టూడెంట్ ఎస్.అర్చనను కలెక్టర్ మంగళవారం అభినందించారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, ఎంఈవో ఆనందం, గైడ్ టీచర్ కె.స్వాతి, హెచ్ఎం బి.భీమేశ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తల్లిదండ్రులు కరుణాకర్, శారద పాల్గొన్నారు.
