‘అన్నలు మా దీన బాంధవులు.. అందుకోండి మా పేదోళ్ల వందనాలు’ అంటూ మొదలైన ఆ గానయాత్ర ఒక తరం గుండెల్లో రగిలిన అగ్నికణం. పల్లె పొలాల్లో, చెట్ల నీడల్లో, గిరిజన గూడెంల మధ్య గజ్జెలు కట్టి గళమెత్తిన ఆ స్వరాలు కేవలం సంగీతం కాదు.. సామాజిక చరిత్ర. ‘జజ్జనకర జనారే… జనకు జనకు జనారే..’ అన్న నృత్యరాగం కేవలం కళ కాదు. అది కదలికకు సంకేతం. ‘లాల్ సలాం...’ అంటూ ఎర్రజెండా ఎత్తిన పాటలు కేవలం నినాదాలు కాదు. సమూహ గుండె చప్పుళ్లు.
1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరి గ్రామంలో పుట్టిన రైతాంగ చినుకు.. శ్రీకాకుళం తీరాలను తాకి తెలంగాణ పల్లెల్లోకి ప్రవహించింది. అసమానతలు, వెట్టి చాకిరి, భూస్వామ్య అరాచకాలు.. ఈ బాధలకు రాగం కట్టినవే విప్లవ గీతాలు. అవి ప్రజల రక్తనాళాల్లో నినాదాల్లా ప్రవహించాయి. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా… ఏం పిల్లో ఎల్దమొస్తవా...’ ఈ గానం ఒక పిలుపు. యువతను ఉద్యమ దారిలోకి ఆహ్వానించిన మృదువైనదే కానీ మర్మమైన ఆహ్వానం. పాటలోని ప్రేమపూర్వక సంభాషణలోనే పోరాటపు సూచన దాగి ఉండేది. వినేవాడు కేవలం శ్రోతగా ఉండలేడు. ఆలోచనలోకి అడుగుపెడతాడు.
ప్రజానాట్యమండలి, జననాట్యమండలి వంటి వేదికలు పాటను ప్రజా ఉద్యమాల ప్రధాన సాధనంగా మలిచాయి. ‘మా భూములు మాకేనని...’ అంటూ భూమి హక్కుల గీతం, ‘దొర ఏందిరో... వాడి జులుం క్యారే’...అంటూ సామంత వ్యతిరేక స్వరం, ‘దున్నేవానికి దుక్కి లేదు రా...’ అంటూ రైతు ప్రశ్న.. ఈ పాటలు ప్రజల ఆవేదనను సామూహిక ఆవేశంగా మార్చాయి.
గద్దర్ స్వరం...గుండెల్ని పిండేసిన గానం
విప్లవ గానానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ గళం వినిపిస్తే పల్లె మైదానాలు మోగేవి. ‘ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది...’అన్న గీతం గిరిజన ప్రాంతాల్లో ఉప్పెనలా వ్యాపించింది. ‘గుండెల్లో రగిలిన బాధ.. కన్నీరై కారుతోంది’ వంటి గీతాల్లో ఆయన గళం ఒక తరం బాధకు భాష్యమిచ్చింది. శ్రీశ్రీ మహాప్రస్థానంతో ఆధునిక తెలుగు కవిత్వానికి విప్లవాత్మక దిశను నిర్దేశించారు. శ్రామిక వర్గాల ఆవేదన, ఆశయాలను కవిత్వంలో ప్రతిష్టించి, పద్యాన్ని ప్రజల పక్షాన నిలబెట్టారు. వరవరరావు కవిత్వం ఫాసిస్టు ధోరణులను ప్రశ్నిస్తూ, సమాజంలోని దోపిడీ యంత్రాంగాన్ని ఎండగట్టింది. వంగపండు ప్రసాదరావు జానపద బాణీలలో విప్లవ భావజాలాన్ని కలిపి, సాధారణ ప్రజల హృదయాలకు అత్యంత చేరువైన గానరూపాన్ని అందించారు. అయితే విప్లవ గీతాల వైభవం కేవలం పేరెన్నికగల కవుల కలంతో మాత్రమే నిర్మితం కాలేదు.
ఎన్నో పల్లెల్లో సామాన్య ప్రజలే తమ కష్టాలను, తమ కోపాన్ని, తమ ఆశయాలను పద్యాలుగా మలిచారు. కూలీ పనికి వెళ్లినవాడు సాయంత్రం డప్పు పట్టి తనే రచించిన గీతాన్ని పాడాడు. రైతు తన భూమి బాధను రాగంగా కట్టాడు. గిరిజన యువకుడు తన గుండెలోని ఆవేదనను నినాదంగా మార్చాడు. పుస్తకాలలో పుట్టని, వేదికల కోసం రాయని ఆ పాటలే జనంలో అత్యధిక ఆదరణ పొందాయి. జనం రచించినవి, జనం మెచ్చినవి, జనం స్వయంగా పాడినవే కాలక్రమేణా అసలైన విప్లవ గీతాలుగా రూపాంతరం చెందాయి. ప్రజల అనుభవాలే పదాలై, వారి స్వరాలే రాగాలై మారినప్పుడు.. విప్లవ గీతం ఒక కవి సొంతం కాకుండా, సమూహ గుండె చప్పుడు ప్రతిధ్వనిగా నిలిచింది.
ఎక్స్‌పైరీనా? లేక పరిణామమా?
లొంగుబాట్లతో ఉద్యమం తగ్గిపోయినా, ఆ గీతాల ప్రతిధ్వని మాయమవలేదు. పాట ఒకప్పుడు దళాలకు పిలుపు అయితే, నేడు అది చరిత్రకు సాక్ష్యం. ఒకప్పుడు రిక్రూట్మెంట్ల గానం అయితే, ఇప్పుడు అది పరిశోధన అంశం. ఒకప్పుడు ఆవేశం అయితే, ఇప్పుడు అది అధ్యయనం. అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి ప్రశ్నించే గళం పూర్తిగా మౌనమవదు. విప్లవ గీతాలు ఎక్స్‌పైరీ కా లేదు. అవి రూపం మార్చుకున్నాయి. పోరాట పల్లవిగా మొదలైన ఆ గానం ఇప్పుడు చరిత్ర గీతంగా మారింది. ఎక్కడో ఏదో ఒక మూలలో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా...’ అనే పిలుపు మళ్లీ వినిపించవచ్చు. ఎక్కడో ఒక సభలో ‘ఎర్రజెండా ఎర్రజెండా...’ అనే గర్జన మళ్లీ ఉర్రూతలూగించవచ్చు. చరిత్రకు గళం ఉంటే అది ఇంకా చెబుతుంది. పాటలు ఎక్స్‌పైరీ కావు. అవి కాలంతోపాటు రూపం మార్చుకుంటాయి.
- కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
