మీ గ్యాస్ స్టవ్ మార్చే టైం వచ్చింది.. నీళ్లు, ఇథనాల్ తో వంట వండే రోజులు వచ్చేశాయ్..!

  మీ గ్యాస్ స్టవ్ మార్చే టైం వచ్చింది.. నీళ్లు, ఇథనాల్ తో వంట వండే రోజులు వచ్చేశాయ్..!

మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో  వంట గ్యాస్ (LPG) సిలిండర్ అనేది చాలా ముఖ్యం. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు వంట అంతా దీనిపైనే జరుగుతుంది. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు పెద్ద భారంగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ఒక కొత్త "ఇథనాల్ ఆధారిత స్టవ్" టెక్నాలజీని ప్రారంభించారు. ఇది హోటళ్లు, వ్యాపారాలలో వాడే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కంటే చాలా తక్కువ ఖర్చుతో వంట చేసుకునేలా చేస్తుందని చెప్పారు.

నితిన్ గడ్కరీ ఏమన్నారంటే 
నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ  మాట్లాడుతూ, ఈ స్టవ్ నీటిలో ఇథనాల్‌ను కలపడం ద్వారా పనిచేస్తుందని వివరించారు. మన దేశంలోనే తయారైన ఈ టెక్నాలజీ, ప్రస్తుతం వాడుతున్న గ్యాస్, కిరోసిన్ వంటి వాటి కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, పర్యావరణానికి మేలు చేస్తుందని చెప్పారు. నీటిలో దాదాపు 7 శాతం ఇథనాల్ కలపడం ద్వారా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కంటే చాలా తక్కువ ధరకే వంటకు కావాల్సిన వేడిని పుట్టించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రయోగం పెద్ద ఎత్తున విజయవంతమైతే, సామాన్యుల ఇంటి బడ్జెట్ భారం తగ్గడమే కాకుండా, విదేశాల నుండి మనం కొనుగోలు చేసే ఇంధనంపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.

భారతదేశంలో ఇథనాల్ వాడకం 
గడిచిన పదేళ్లలో మన దేశంలో ఇథనాల్ వాడకం చాలా వేగంగా పెరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహం, బయో-ఫ్యూయల్  రంగానికి ఇచ్చిన మద్దతు వల్ల.. 2014లో పెట్రోల్‌లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం, 2025 నాటికి దాదాపు 20 శాతానికి చేరుకుంది. ఈ ఇథనాల్-వాటర్ స్టవ్ పూర్తిగా మన దేశీయ సాంకేతికతతో తయారైందని, దీనివల్ల విదేశీ దిగుమతులు తగ్గి భారతదేశానికి ఎంతో ఆర్థిక లాభం చేకూరుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  చెప్పారు.

అసలు ఇథనాల్‌ ఎందుకు 
ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్ ఆధారిత జీవ ఇంధనం. దీనిని ముఖ్యంగా చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల  నుండి తయారు చేస్తారు.

►ALSO READ | ఉత్తరాఖండ్‌‌లో భారీ వర్షాలు.. కేదార్‌‌నాథ్ యాత్రకు బ్రేక్

దీనివల్ల కలిగే లాభాలు:
*ఇది మండేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను చాలా తక్కువగా విడుదల చేస్తుంది. 
*ఇళ్లలో గాలి కాలుష్యం తగ్గుతుంది.
*రైతులకు మేలు చేసేల చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
* వంట ఖర్చులు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే గ్యాస్ భారం తగ్గుతాయి.

 ఎల్‌పీజీని నిజంగానే భర్తీ చేయగలదా 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్‌గా కొన్ని సవాళ్లు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల సప్లయ్ సిస్టం ప్రతి ఊరికీ, ఇంటికీ విస్తరించి ఉంది. దాని స్థానంలో ఇథనాల్‌ను తీసుకురావాలంటే అంతే బలమైన సప్లై చైన్ కావాలి, ప్రజలు కూడా దీనిని నమ్మి అలవాటు పడాలి. భవిష్యత్తులో 100% ఇథనాల్‌తో నడిచే ఇంధన వ్యవస్థలను తేవాలని నితిన్ గడ్కరీ కోరుకుంటున్నారు. దీనితో పాటు ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోగ్యాస్‌లను కూడా ప్రోత్సహిస్తోంది.

 దేశంలో ఉన్న ఇంత పెద్ద జనాభా అవసరాలకు సరిపడా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం అంత సులువైన విషయం కాదు. ఈ ఇథనాల్ స్టవ్ ఆలోచన ఎంతవరకు నిజ జీవితంలో సక్సెస్ అవుతుందో రానున్న రోజుల్లో చూడాల్సిందే.