- ప్రతి సీజన్లో రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్న దళారులు
- తొర్రూరులో పట్టుబడిన 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలు
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ, పోలీస్ శాఖల సంయుక్త తనిఖీలు ముమ్మరం
మహబూబాబాద్, వెలుగు: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ, అనుమతి లేని (బీటీ-3 వంటి నిషేధిత) పత్తి విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా తనిఖీలను ముమ్మరం చేశాయి. ప్రతి ఏడాది సీజన్ ప్రారంభంలో గిరిజన తండాలు, గ్రామాల్లో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి దళారుల ద్వారా స్థానిక ఏజెంట్లు నకిలీ పత్తి, మిర్చి విత్తనాల సప్లై చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
గుంటూరు జిల్లా నుంచి ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ తదితర సరిహద్దు జిల్లాలకు నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు సమాచారం. అధికారుల తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. మే 30న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాలో 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
గ్రామాల్లో ప్రత్యేక నిఘా..
టీక్యా తండాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తొర్రూరు పోలీసులు, సీసీఎస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టీక్యా తండాకు చెందిన జాటోత్ వెంకన్న, అతడి అల్లుడు బర్మావత్ సోమన్నను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విత్తనాల మూలాలు, సరఫరా వ్యవస్థపై అధికారులు సమగ్ర విచారణ చేపడుతున్నారు.
వరంగల్ వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గడువు ముగిసిన విత్తనాలు, నకిలీ పురుగుమందులు, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్ (గడ్డి మందు) వంటి కెమికల్స్‌ను బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ప్యాక్ చేసి విక్రయిస్తున్న పలు ముఠాలను గతంలో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతులకు అనుకూలంగా కస్టమర్ ఫోరంలో తీర్పు..
గతంలో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి పరిధిలో నకిలీ ‘ధన్య’ రకం మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన 8 మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హైదరాబాద్ కన్స్యూమర్ కమిషన్ ఇటీవల సంబంధిత సీడ్స్ కంపెనీని ఆదేశించింది.
విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు..
ప్రతి డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ, పోలీస్ (టాస్క్‌ఫోర్స్), రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలు చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి లాట్ నంబర్లు లేని లూజ్ విత్తనాల రవాణాను అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దులు, చెక్‌పోస్టులు, రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండా విత్తనాలు నిల్వ చేసినా, రసీదులు లేకుండా విక్రయించినా సంబంధిత ఫర్టిలైజర్ డీలర్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
అప్రమత్తంగా ఉండాలి..
విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా డీలర్ సంతకంతో కూడిన క్యాష్ బిల్ (రసీదు) తీసుకోవాలి. ప్యాకెట్‌పై ఉన్న లాట్ నంబర్, గడువు తేదీని పరిశీలించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలి. ఎవరైనా లూజ్ విత్తనాలు విక్రయిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
- సరిత, మహబూబాబాద్జిల్లా వ్యవసాధికారిణి
