అమెరికా కంపెనీ కాంట్రాక్ట్ కోల్పోయిన HCLTech.. డేంజర్‌లో 200 మంది ఉద్యోగులు

అమెరికా కంపెనీ కాంట్రాక్ట్ కోల్పోయిన HCLTech.. డేంజర్‌లో 200 మంది ఉద్యోగులు

భారతీయ ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, క్లయింట్ ఒప్పందాల రద్దు వంటి వార్తలు ఉద్యోగులను మరోసారి ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ కు గట్టి షాక్ తగిలింది. ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ 'జెరాక్స్ కార్పొరేషన్'తో ఉన్న ఒక కీలకమైన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కాంట్రాక్ట్‌ను హెచ్‌సీఎల్‌టెక్ కోల్పోబోతోంది. ఈ ఒప్పందం ఈ జూన్ నెలతో ముగియనుండటంతో.. ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న సుమారు 200 మంది ఉద్యోగులు లేఆఫ్స్ ముంగిట నిలిచారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఈ కాంట్రాక్ట్ రద్దు కావడం నోయిడా ప్రధాన కేంద్రంగా పనిచేసే హెచ్‌సీఎల్‌టెక్ ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బగా మారింది.

ఫిలిప్పీన్స్‌కు మారిన జెరాక్స్ ప్రాజెక్ట్..
లాభాల క్షీణతను ఎదుర్కొంటూ, వ్యాపార పునర్నిర్మాణంలో ఉన్న జెరాక్స్ సంస్థ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఎల్‌టెక్‌తో ఉన్న బీపీఎం కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయకూడదని జెరాక్స్ భావిస్తోంది. ఈ పనిలో ఎక్కువ భాగాన్ని ఫిలిప్పీన్స్‌లో ఉన్న తమ స్వంత ఇన్-హౌస్ యూనిట్‌కు బదిలీ చేయాలని, మిగిలిన కొద్దిపాటి పనిని అక్కడి స్థానిక థర్డ్ పార్టీ బీపీఎం సంస్థకు అవుట్‌సోర్స్ చేయాలని జెరాక్స్ ప్లాన్ చేస్తోంది.

ముందే అందిన సంకేతాలు..
ఈ కాంట్రాక్ట్ ముగిసిపోతుండటంతో అత్యంత ఎక్కువగా నష్టపోతున్నది నోయిడా క్యాంపస్ నుంచి పనిచేస్తున్న ఉద్యోగులేనట. దాదాపు 2 నెలల క్రితమే ఈ ఉద్యోగులకు కంపెనీ వెలుపల కొత్త అవకాశాలను వెతుక్కోవాలని యాజమాన్యం సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో మొదటి విడత పని పూర్తయిందని, దాదాపు 50 మంది ఉద్యోగులు ఇప్పటికే బెంచ్‌కి పరిమితమయ్యారని సమాచారం. దురదృష్టవశాత్తూ వీరిని కంపెనీలోని ఇతర ప్రాజెక్టులలోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేయడంతో వీరు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు.

ALSO READ : ఇండియా వస్తున్న కాక్రోచ్ పార్టీ సృష్టికర్త అభిజీత్ 

17 ఏళ్ల సుదీర్ఘ బంధంలో కుదుపు..
జెరాక్స్ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్‌కు దాదాపు 17 ఏళ్లుగా అత్యంత కీలకమైన క్లయింట్‌గా కొనసాగుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య బిలియన్ డాలర్ల విలువైన సాంకేతిక ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు రద్దవుతున్న బీపీఎం కాంట్రాక్ట్ అనేది హెచ్‌సీఎల్‌టెక్ అందిస్తున్న మొత్తం సేవల్లో చిన్న పార్ట్ మాత్రమే. అయినప్పటికీ ఉద్యోగుల తొలగింపు పరంగా ఇది పెద్ద ప్రభావమే చూపుతోంది. ఈ విషయమై హెచ్‌సీఎల్‌టెక్ స్పందిస్తూ.. పాలసీ ప్రకారం క్లయింట్ ఒప్పందాలపై తాము వ్యాఖ్యానించలేమని, అంతర్జాతీయ క్లయింట్లతో తమ బంధం బలంగానే ఉందని పేర్కొంది.

🇺🇸 అమెరికాలోనూ లేఆఫ్స్..
కేవలం దేశంలోనే కాకుండా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హెచ్‌సీఎల్‌టెక్ అనుబంధ సంస్థలో కూడా లేఆఫ్స్ నడుస్తున్నాయి. ఒక క్లయింట్ ప్రాజెక్ట్ పునర్నిర్మాణంలో భాగంగా ఆర్లాండోలో 120 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మే 29 నుండి ప్రారంభమైంది. ఇది 2026 డిసెంబర్ చివరి వరకు, కొన్ని తొలగింపులు 2027 ప్రారంభం వరకు కొనసాగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 2.26 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్న హెచ్‌సీఎల్‌టెక్‌లో జరుగుతున్న మార్పులు ప్రపంచ ఐటీ మార్కెట్లో నెలకొన్న మందగమనాన్ని, ఆటోమేషన్ అవసరాన్ని సూచిస్తోంది.