ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ లు

ఇరాన్ తో  వ్యాపారం చేసే దేశాలపై  25 శాతం టారిఫ్ లు
  •     అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన 
  •     ఇండియా, చైనా, యూఏఈ, తుర్కియే తదితర దేశాలపై ప్రభావం 
  •     ఇండియాపై 75 శాతానికి సుంకాలు

    
వాషింగ్టన్: నిరసనకారులను కాల్చి చంపుతున్న ఇరాన్ పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నామని హెచ్చరించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. అందుకు బదులుగా టారిఫ్ బాంబు పేల్చారు. ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ‘‘ఇరాన్ తో వాణిజ్యం చేసే దేశాలపై టారిఫ్​లు విధిస్తున్నాం. ఆ దేశాలన్నీ అమెరికాకు ఎగుమతి చేసే అన్ని వస్తువులపై 25 టారిఫ్ లు చెల్లించాలి. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది” అని ట్రంప్ సోమవారం తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఇరాన్ తో వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉన్న ఇండియా, చైనా, యూఏఈ, తుర్కియే, ఇరాక్ దేశాలపై గణనీయంగా ప్రభావం పడనుంది. మరోవైపు గ్లోబల్ సప్లై చైన్ కూడా దెబ్బతిని, అనేక దేశాల్లో ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ట్రంప్ ఆంక్షలు పూర్తి ఏకపక్షంగా ఉన్నాయని చైనా ఖండించింది. ఇరాన్ కు చైనా ప్రస్తుతం అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్ నర్ గా ఉంది. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. 2022లో చైనాకు ఇరాన్ నుంచి 22 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఇందులో సగం వరకూ ఫ్యూయెల్స్ ఉన్నాయి. చైనా నుంచి ఇరాన్ కు 15 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇక 2025లో ఇరాన్ ఎగుమతి చేసిన క్రూడ్ ఆయిల్ లో 80 శాతం చైనాయే కొనుగోలు చేసింది. అణ్వస్త్రాల తయారీ సాకుతో అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు అతికొద్ది దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటికే చైనాపై అమెరికా 30 శాతం టారిఫ్ లు వేస్తోంది. తాజాగా 25 శాతం కలిపి.. టారిఫ్ లు 55 శాతానికి పెరగనున్నాయి. అలాగే తుర్కియే, యూఏఈ, జర్మనీ, సౌత్ కొరియా, బ్రెజిల్, రష్యా దేశాలపైనా ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ప్రభావం పడనుంది.

ఇండియాపై 75 శాతానికి..

గత కొన్నేండ్లలో ఇరాన్​కు ఐదు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్​నర్లలో ఇండియా కూడా ఒకటిగా ఉంది. ఇండియా నుంచి ఇరాన్​కు బాస్మతి రైస్, కూరగాయలు, పండ్లు, మందులు, ఇతర ఫార్మా ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాదిలో రెండు దేశాల మధ్య దాదాపు 1.34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అలాగే ఇరాన్​లో 2015 నుంచి చాబహర్ పోర్టు ప్రాజెక్టును ఇండియా డెవలప్ చేస్తోంది. ఇప్పటికే ఇండియాపై ప్రతీకార సుంకాల పేరుతో 25%, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు అదనంగా మరో 25% టారిఫ్ లను అమెరికా విధించింది. తాజాగా మరో 25% కలిపితే మొత్తం టారిఫ్ లు 75%కు చేరనున్నాయి.