హర్మన్‌‌.. సూపర్‌‌..గుజరాత్ పై ముంబై విక్టరీ

హర్మన్‌‌.. సూపర్‌‌..గుజరాత్ పై ముంబై విక్టరీ
  • 7 వికెట్ల తేడాతో గుజరాత్‌‌పై గెలుపు..రాణించిన అమన్‌‌జోత్‌‌, కేరి

నవీ ముంబై: బ్యాటింగ్‌‌లో రాణించిన ముంబై ఇండియన్స్‌‌.. డబ్ల్యూపీఎల్‌‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.  భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (71 నాటౌట్‌‌), అమన్‌‌జోత్‌‌ కౌర్‌‌ (40) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్‌‌ జెయింట్స్‌‌పై గెలిచింది. ముందుగా గుజరాత్‌‌ 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. జార్జియా వారెహామ్‌‌ (43 నాటౌట్‌‌), భారతి ఫుల్మాలి (36 నాటౌట్‌‌) చెలరేగారు. తర్వాత ముంబై 19.2 ఓవర్లలో 193/3 స్కోరు చేసి గెలిచింది. లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు కమళిని (13), హేలీ మాథ్యూస్‌‌ (22) మెరుగైన ఆరంభాన్నివ్వలేదు. 37 రన్స్‌‌ చేసి వెనుదిరిగారు. ఈ దశలో అమన్‌‌జోత్‌‌, హర్మన్‌‌, కేరీ అద్భుతంగా ఆడారు. హర్మన్​.. అమన్‌‌జోత్‌‌తో మూడో వికెట్‌‌కు 72, నికోలా కేరి (38 నాటౌట్‌‌)తో నాలుగో వికెట్‌‌కు 84  రన్స్‌‌ జోడించింది. హర్మన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

జార్జియా, భారతి ధనాధన్‌‌..

గుజరాత్‌‌ను ఆరంభంలో కట్టడి చేసిన ముంబై బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. ఇన్నింగ్స్‌‌ మూడో ఓవర్‌‌లో సోఫీ డివైన్‌‌ (8)ను ఔట్‌‌ చేసినా.. తర్వాతి బ్యాటర్లు ధనాధన్‌‌ షాట్లతో రెచ్చిపోయారు. ఓపెనర్‌‌ బెత్‌‌ మూనీ (33), కనికా అహుజా (35) భారీ షాట్లతో చెలరేగారు. దాంతో పవర్‌‌ప్లేలో గుజరాత్‌‌ 62/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత కూడా ముంబై బౌలర్లు గాడిలో పడలేదు. సరైన టైమ్‌‌లో వికెట్లు తీసినా.. రన్స్‌‌ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. రెండో వికెట్‌‌కు 42 రన్స్‌‌ జత చేసి ఏడో ఓవర్‌‌లో మూనీ వెనుదిరిగింది. అహుజాకు తోడైన కెప్టెన్‌‌ ఆష్లే గార్డెనర్‌‌ (20) మూడో వికెట్‌‌కు 33 రన్స్‌‌ జోడించింది. అయితే ఐదు బాల్స్‌‌ తేడాలో ఇద్దరూ ఔట్‌‌ కావడంతో గుజరాత్‌‌ 99/4తో నిలిచింది. ఈ దశలో వారెహామ్‌‌ సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడింది. రెండో ఎండ్‌‌లో ఆయుషి సోనీ (11) ఎక్కువసేపు నిలవకపోయినా.. ఐదో వికెట్‌‌కు 35 రన్స్‌‌ భాగస్వామ్యం నెలకొల్పింది. 17వ ఓవర్‌‌లో బ్యాటింగ్‌‌కు దిగిన భారతి, వారెహామ్‌‌తో ఆరో వికెట్‌‌కు 56 రన్స్‌‌ జత చేశారు.