సింగరేణి భూముల్లో ఇండ్ల జాగాలకు పట్టాలు ఇప్పిస్త:మంత్రి వివేక్వెంకటస్వామి

సింగరేణి భూముల్లో ఇండ్ల జాగాలకు పట్టాలు ఇప్పిస్త:మంత్రి వివేక్వెంకటస్వామి
  • రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి
  • ఓసీపీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి పునరావాసం, సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్త
  • క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డుల్లో మంత్రి మార్నింగ్ వాక్ 

కోల్​బెల్ట్, వెలుగు:  సింగరేణి భూముల్లో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. జీవో నంబర్​76ను పునరుద్ధరించి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో మాట్లాడతానని, ఇండ్ల పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మార్నింగ్ వాక్​చేశారు. మంత్రి వార్డుల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రామకృష్ణాపూర్ ఓసీపీ డస్ట్ లెవల్స్ మానిటర్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సింగరేణి యాజమాన్యంతో చర్చించి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బొగ్గు తవ్వకాల కోసం చేస్తున్న బ్లాస్టింగ్ ప్రభావం కూడా తగ్గించేలా చూడాలని మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణను ఆదేశించారు. 4వ వార్డును ఓసీపీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి స్థానికులకు పునరావాసం కల్పించేలా సింగరేణి అధికారులతో చర్చిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. నాలాలు క్లీన్ చేయించి, అవసరమైన చోట కొత్తగా సీసీ డ్రైనేజీలను, కల్వర్టులను ముందుగానే నిర్మించాలని మున్సిపల్ ఆఫీసర్లకు సూచించారు. క్యాతనపల్లి వార్డుల్లో అభివృద్ధి కోసం రూ.15కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే చాలా వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయ్యిందని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. 3,18 వార్డుల మధ్యలో రూ.5 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్ ప్రభావిత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తానని అన్నారు. కాలనీల వాసులు రోడ్లు, డ్రైయినేజీలు, కరెంట్ పోల్స్, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వర్షాకాలంలో వరదలతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరుతుందని, కల్వర్టు, నాలాలలో చెత్త పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కాలనీల్లో బెల్ట్ షాపులవల్ల ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోయారు. రామకృష్ణాపూర్ ఓపెన్​కాస్ట్​లో బ్లాస్టింగ్స్​తో ఇండ్లు కూలిపోతున్నాయని, దుమ్మూ, ధూళితో అనారోగ్యం పాలవుతున్నట్టు నాలుగో వార్డు ప్రజలు వివరించారు. తమ వార్డును ఓపెన్​కాస్ట్​ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి పునరావాసం, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మందమర్రి తహసీల్దార్ సతీశ్​కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ట్రాన్స్​కో ఏఈ ప్రభాకర్​ను ఆదేశించారు. కాలనీల్లో బెల్టు షాపులను తొలగించాలని పోలీసులకు సూచించారు. మంత్రి వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డి, ఏస్వోటుజీఎం ప్రసాద్, కాంగ్రెస్ లీడర్లు పల్లె రాజు, జంగం కళ, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మహంకాళీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.