- లక్కీ డ్రా తీశాక మాట తప్పి మోసం
ఖానాపూర్, వెలుగు: ‘వెయ్యి రూపాయలు కట్టండి.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. లక్షల విలువైన ఆస్తి సొంతం చేసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి అమాయకులను మోసం చేసిన ఘటన ఖానాపూర్‌లో వెలుగుచూసింది.
ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలో ఉన్న రెండు షట్టర్ రూములను విక్రయించేందుకు కొత్త ఎత్తుగడ వేశాడు. సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని రూ.వెయ్యి చొప్పున కూపన్లు అమ్మాలనుకున్నాడు. 5 వేల మందిని టార్గెట్‌గా పెట్టుకుని రూ.50 లక్షలు సమకూర్చుకోవాలని ప్రణాళిక రచించాడు.
గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను వెంట తీసుకుని లక్కీ డ్రా కూపన్లు విక్రయించాడు. కూపన్లు కొనుగోలు చేసిన వారి సమక్షంలో లక్కీ డ్రా కూడా నిర్వహించాడు. ఈ డ్రాలో ఖానాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి విజేతగా నిలిచాడు. అయితే ఆశించిన మేర కూపన్లు అమ్ముడు పోలేదని, రెండు షట్టర్ రూములు ఇవ్వలేమని, ఒక్కటే ఇస్తామని నిర్వాహకుడు వెనక్కి తగ్గడంతో వివాదం చెలరేగింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు బాదనకుర్తి గ్రామానికి చెందిన మురళిపై కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్‌ఐ రాహుల్ గైక్వాడ్ తెలిపారు. కేసు నమోదు కావడంతో నిర్వాహకులు లక్కీ డ్రా విజేతతో బేరసారాలకు దిగినట్లు సమాచారం. షట్టర్ రూములకు బదులుగా కొంత నగదు ఇచ్చి వ్యవహారం ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కూపన్లు కొనుగోలు చేసిన బాధితులు తమ డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
2300 కూపన్లు విక్రయించగా రూ.23 లక్షలు నిర్వాహకులకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో గతంలోనూ ఆగస్టు 15న లక్కీ డ్రా అంటూ కొత్తగా రెండు షట్టర్ రూముల ఫొటోలతో కరపత్రాలు, వాట్సాప్ సందేశాలతో ప్రచారం చేసినట్లు తెలిసింది.
ఖానాపూర్ ప్రాంతంలో కొన్నేళ్లుగా వన్ ఫోర్ ఎక్స్, వీసీఐ, యూబిట్ కాయిన్ వంటి ఆన్‌లైన్ స్కీమ్‌లతో పాటు కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లతో మోసాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్కీ డ్రా పేరుతో వచ్చే స్కీములను నమ్మవద్దని ఖానాపూర్ ఎస్‌ఐ రాహుల్ గైక్వాడ్ సూచించారు.
