- నెలాఖరులోపు వెయ్యి కోట్లు రిలీజ్
- నిధుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. జీపీలకు రావాల్సిన రూ. 2,500 కోట్ల పెండింగ్ నిధుల్లో ఈ నెలాఖరులోపు కనీసం రూ. వెయ్యి కోట్లు రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సమాచారం అందింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీల నిధుల వినియోగానికి పీఆర్, ఆర్డీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాలకు మెమో జారీ చేసి, నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేసింది.
ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక ఖాతా..
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం..ప్రతి జీపీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఖాతాను పీఎఫ్ఎంఎస్(పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి.
ఈ– గ్రామ్స్వరాజ్ పోర్టల్‌లో కూడా బ్యాంకు అకౌంట్ వివరాలను నమోదు చేయాలి. ఉపసర్పంచ్ మేకర్‌గా, సర్పంచ్ చెకర్‌గా వ్యవహరిస్తారు. వీరి డిజిటల్ సంతకాలను ఈ- గ్రామ్ స్వరాజ్ లో నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి. సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యంతోపాటు యూఎస్బీ టోకెన్ కూడా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జీఈఎం పోర్టల్, ఈ- ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా సేకరించాలని అధికారులను పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రుతి ఓజా ఆదేశించారు.
