అహ్మదాబాద్: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్) మానవాళికి పెను ముప్పుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి సమగ్రమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని నిపుణులను కోరారు. ఈమేరకు మంగళవారం గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ బీఎస్ఎల్–4 బయోకంటైన్ మెంట్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఏఎమ్ఆర్ ను ఒక నిశ్శబ్ద విపత్తుగా అభివర్ణించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘‘యాంటీబయాటిక్స్ కు వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన రెసిస్టన్సే ఏఎమ్ఆర్. ఇది ప్రస్తుత సమాజం, మానవాళికి భారీ ముప్పు. ఇది ఒక నిశ్శబ్ద విపత్తు” అని హెచ్చరించారు.
