ఇక ట్యాంక్ బండ్ క్లీన్ అండ్ బ్లూ...హుస్సేన్ సాగర్ లోపల, బయట చెత్త, ప్లాస్టిక్ తొలగింపుపై హెచ్ఎండీఏ ఫోకస్..

ఇక ట్యాంక్ బండ్ క్లీన్ అండ్ బ్లూ...హుస్సేన్ సాగర్ లోపల, బయట చెత్త, ప్లాస్టిక్ తొలగింపుపై హెచ్ఎండీఏ ఫోకస్..
  • శుభ్రం​ చేయడానికి టెండర్లు ఆహ్వానించనున్న హెచ్ఎండీఏ 
  • మూడేండ్లు.. రూ. 7.11 కోట్ల ఖర్చు.. 

హైదరాబాద్​సిటీ, వెలుగు :నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్​బండ్​(హుస్సేన్​సాగర్​)లో వ్యర్థాల తొలగింపును హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందులో భాగంగా హుస్సేన్​సాగర్​లోపల, బయట క్లీనింగ్​పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ రెండు డ్రిడ్జ్​యుటిలిటీ క్రాఫ్ట్స్​(డీయూసీ)లను ఉపయోగించి చెత్తను తొలగిస్తోంది. అలాగే, మూడు నెలలే క్లీన్​చేయడానికి కంపెనీలకు బాధ్యతలు అప్పగిస్తుండడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో మూడేండ్ల కాలానికి సాగర్​లో వ్యర్థాల తొలగింపు బాధ్యతలను రెండు కంపెనీలకు అప్పగించేందుకు హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం టెండర్లు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు 

అంతటా వ్యర్థాలే...

హుస్సేన్​సాగర్​వంద అడుగుల లోతు ఉండగా, 4.7 చ. కి.మీ.పరిధిలో నీళ్లు ఉన్నాయి. చుట్టుపక్కల దాదాపు 14.70  చ.కి.మీ మేర ఇది విస్తరించి ఉంది. రోజూ ట్యాంక్​బండ్​కు వచ్చే విజిటర్స్​చిరుతిళ్లు తిని మిగిలిన వ్యర్థాలను, కవర్లను సాగర్​లో పడేస్తున్నారు. సంజీవయ్య పార్క్, జలవిహార్, పీపుల్స్​ప్లాజా, రాక్​గార్డెన్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్​మార్గ్, సెయిలర్స్​క్లబ్, బోట్స్​క్లబ్​తదితర ప్రాంతాల వైపు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లోని సాగర్​లో పడే నీళ్లలోని వ్యర్థాలు కుళ్లి తేలియాడుతున్నాయి. మరికొందరైతే ఇండ్లలోని పూజా సామగ్రి తెచ్చి పడేస్తున్నారు. దీంతో సాగర్​చెత్తమయంగా మారింది. 

రెండు సెక్టార్లుగా విభజన

హుస్సేన్​సాగర్​లోని చెత్త, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యర్థాలను తొలగించేందుకు ఆయా ప్రాంతాలను హెచ్ఎండీఏ రెండు సెక్టార్లుగా విభజించింది. ట్యాక్​బండ్​సాగర్​పార్క్, బీపీపీ, లుంబినీ పార్క్, ఎన్టీఆర్​మార్గ్, రోటరీ గార్డెన్, బ్రిడ్జి–1, సిద్ధార్థ పాండ్​, బుల్కాపూర్​నాలా నుంచి ఐఅండ్​డీ కాలువ, పీపుల్స్​ప్లాజా బ్రిడ్జి–2, బ్రిడ్జి–3 నుంచి జలవిహార్​వరకు 6.47 కి.మీ పరిధిని సెక్టార్-1గా,  జలవిహార్, అగరం పోచయ్య బ్రిడ్జి–4,  పీవీ ఘాట్, సంజీవయ్య పార్క్, బ్రిడ్జి –5  పికెట్ నాలా ఐఅండ్​డీ పికెట్​నాలా వరకు, బుద్ధభవన్, దానిని ఆనుకుని ఉన్న వర్క్​షాప్స్, సెయిలింగ్​క్లబ్​సర్​ప్లస్​వియర్​అక్కడి నుంచి బతుకమ్మ ఘాట్​వరకు మొత్తం 8.25 కి.మీలను సెక్టార్-2గా నిర్ణయించారు. 

మూడు సంవత్సరాల టైం.. 

ట్యాంక్​బండ్ లో వ్యర్థాల తొలగింపులో భాగంగా రెండు సెక్టార్లను రెండు కంపెనీలకు మూడేండ్లకు అప్పగించేందుకు ప్లాన్​చేస్తోంది. ఒక్కో సెక్టార్​లో దాదాపు 40 మంది కార్మికులు వ్యర్థాలు తొలగించేలా చూడనున్నారు. నీటి పై తేలియాడే చెత్తను, ప్లాస్టిక్​కవర్లను తొలగించడానికి ఐదు పెడల్​బోట్లను వినియోగించనున్నారు. ఒక్కోబోట్​లో ముగ్గురు లేబర్లు ఉంటారు. ఈ వ్యర్థాలను తరలించేందుకు రెండు ఏజెన్సీలకు పనులు అప్పగిస్తారు. 14.70 చ. కి.మీ పరిధిలోని ట్యాంక్​బండ్​పరిసరాల్లోని ఇన్​ఫ్లో ఛానెల్స్​ బంజారా నాలా, బుల్కాపూర్​నాలా, పికెట్​నాలా, కూకట్​పల్లి నాలాల నుంచి వచ్చే వ్యర్థాలనూ తీసేస్తారు. 

సెక్టార్​-1 పరిధిలో వ్యర్థాలను తొలగించేందుకు రూ.3.22 కోట్లు, సెక్టార్-2లో వ్యర్థాల తొలగింపునకు రూ.3.89 కోట్లు ఖర్చు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలే మూడేండ్ల పాటు సాగర్​జలాల్లో వ్యర్థాలు పడకుండా, పరిసరాల్లో విజిటర్స్​చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో టెండర్లను ఆహ్వానించి పనులను అప్పగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.