- వెల్లడించిన ఆ దేశ ఉన్నతాధికారి.. ప్రాణ నష్టానికి టెర్రరిస్టులే కారణం
- ఇంటర్నెట్పై కొనసాగుతున్న బ్యాన్
- తప్పుడు లెక్కలు అంటున్న స్వచ్ఛంద సంస్థలు
- 12 వేల మంది మృతి చెందారని నివేదికలు
- 26 ఏండ్ల నిరసనకారుడికి ఉరి శిక్ష విధింపు!
దుబాయ్: ఇరాన్‌లో గత 2 వారాలుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 2 వేల మంది చనిపోయారని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. మరణాలు ఈ స్థాయికి చేరడానికి టెర్రరిస్టులే కారణమని పేర్కొన్నారు. మృతుల్లో సాధారణ పౌరులు, చిన్నారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రాణనష్టంపై భిన్నమైన నివేదికలు వస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు 2,000 మంది మరణించారని పేర్కొనగా, మరికొన్ని నివేదికలు మృతుల సంఖ్య 12వేలకు పైనే ఉంటుందని చెప్తున్నాయి. సదరు ఇరాన్ ఉన్నతాధికారి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘‘సామాన్య పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి ఉగ్రవాద చర్యలే కారణం. డిసెంబర్ చివరలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు తీవ్ర రక్తపాతానికి దారితీశాయి. ఈ నిరసనల వెనుక ‘విదేశీ కుట్ర’ దాగి ఉన్నది. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది. అల్లర్లు, హింసకు కారణమైన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
నిరసనల ముసుగులో టెర్రర్ ఆపరేషన్లు..
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని, దీనికి బలమైన కారణం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. నిరసనల ముసుగులో జరుగుతున్న టెర్రర్ ఆపరేషన్లకు విదేశా ల నుంచి ఆదేశాలు అందుతున్నట్లు గుర్తించామని తెలిపారు. అందుకే ఇంటర్నెట్ కట్ చేయాల్సి వచ్చిందని వివరించారు. ‘‘శాంతియుత నిరసనలను హింసాత్మకంగా మార్చింది కొంతమంది టెర్రరిస్టులనేది స్పష్టమైంది. వీరి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఉన్నాయి’’ అని అరాగ్చీ ఆరోపించారు. నిరసనకారులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిరసనల్లో పాల్గొనేవారిని ‘దేవుడికి శత్రువులు’గా పరిగణిస్తామని, వారికి మరణశిక్ష కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
మృతుల సంఖ్యపై భిన్నవాదనలు
మృతుల సంఖ్యపై పలు స్వతంత్ర సంస్థలు, మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 12వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఇంటర్నేషనల్ సంస్థ అంచనా వేసింది. ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడంతో కచ్చితమైన సంఖ్య తెలియరాలేదని పలు సంఘాలు చెబుతున్నాయి. గత 48 గంటల్లోనే 2 వేలకు పైగా మరణాలు సంభవించాయని వెల్లడించాయి. 6 వేల నుంచి 12 వేల మంది చనిపోయారని మరికొన్ని సంస్థలు చెప్తున్నాయి. నిరసనకారులపై కాల్పులు జరపడంపై యూఎన్ హ్యూమన్ రైట్స్ విభాగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిరసనకారులను ‘టెర్రరిస్టులు’ అని పిలవడాన్ని ఖండించింది. సుమారు 10 వేలకు పైగా నిరసనకారులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం కొన్ని ఫోన్ కాల్స్ సేవలను పునరుద్ధరించినప్పటికీ, ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నది.
ఇరాన్‌ను వీడండి: అమెరికా, స్వీడన్
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడున్న తమ పౌరులంతా వెనక్కి వచ్చేయాలని అమెరికా, స్వీడన్ దేశాలు ఓ హెచ్చరిక జారీ చేశాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం, అరెస్టులు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పరిస్థితి అదుపు తప్పుతోందని అమెరికా పేర్కొంది. సాధ్యమైతే ఆర్మేనియా లేదా తుర్కియే సరిహద్దుల ద్వారా భూమార్గంలో దేశం దాటాలని సూచించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్‌కు వెళ్లొద్దని స్వీడన్ స్పష్టం చేసింది.
ఓ నిరసనకారుడికి ఉరి..
ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న తాజా నిరసనలకు సంబంధించి, ఓ 26 ఏండ్ల యువకుడికి మరణశిక్ష విధించినట్లు తెలుస్తున్నది. టెహ్రాన్ శివారులోని కర్జ్ ప్రాంతానికి చెందిన ఎర్ఫాన్ సుల్తానీ.. అయాతొల్లా ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఖమేనీ సర్కార్.. ఎర్ఫాన్కు ఉరి శిక్ష విధించింది. జనవరి 8న ఎర్ఫాన్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడనే తీవ్రమైన నేరారోపణను మోపాయి. ఇరాన్ చట్టాల ప్రకారం ఈ నేరానికి మరణశిక్ష విధిస్తారు. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం ఎర్ఫాన్‌ను బుధవారం ఉరి తీసే అవకాశం ఉంది.
