తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు 15 రోజుల ముందు మేడారంలో సమ్మక్క గుడిని, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిని వనదేవతల పూజారులు గుడి మెలిగే(గుడి శుద్ధి) పండుగను ఘనంగా నిర్వహిస్తారు. బుధవారం ఉదయాన్నే మేడారంలో సమ్మక్క పూజారులు సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు, కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కాక వంశీయులు గుడిని శుద్ధి చేస్తారు. అనంతరం ఆడపడుచులు అడవిలో ముందుగానే సేకరించిన పుట్టమన్నుతో గుడులలో అలికి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీంతో మేడారం మహా జాతర తొలి ఘట్టం ప్రారంభమవుతుందని పూజారులు తెలిపారు.
వనదేవతలను దర్శించుకున్న కేశినేని నాని
వనదేవతలను విజయవాడ మాజీ ఎంపీ కేసీనేని నాని దర్శించుకున్నారు. మేడారం వచ్చిన ఆయనకు పూజారులు, ఎండోమెంట్ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి గద్దెల వద్ద పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం) సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇర్ఫా సుకన్య సునీల్, కాంట్రాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
