న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2026, జనవరి 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, కరూర్ తొక్కిసలాట కేసులో 2026, జనవరి 12న విజయ్ను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీసులో దాదాపు ఆరున్నర గంటల పాటు విజయ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు.
అయితే.. ఈ కేసులో మరిన్నీ వివరాలు రాబట్టాల్సి ఉండటంతో విజయ్ను మరోసారి ఇన్విస్టిగేట్ చేయాలని దర్యాప్తు సంస్థ డిసైడ్ అయ్యింది. అయితే.. సంక్రాంతి తర్వాత విచారణకు హాజరు అవుతానన్న విజయ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ.. జనవరి 19న విచారణకు హాజరు కావాలని మంగళవారం (జనవరి 13) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఓసారి విజయ్ను విచారించిన సీబీఐ మరోసారి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 19న విజయ్ను సీబీఐ అరెస్ట్ చేయబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?
తమిళనాడులోని కరూర్లో 2025, సెప్టెంబర్ 27న విజయ్ పార్టీ టీవీకే బహిరంగ సభ, రోడ్ షో జరిగిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఈ ర్యాలీ సెప్టెంబర్ 27 మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా, విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో గంటగంటకూ జనం రద్దీ పెరిగింది.
సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 30 వేల మంది జనం పోగయ్యారు. అయితే, మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండటంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా.. ఆయనను దగ్గర నుంచి చూసేందుకని జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొందరు కిందపడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కిందపడిపోయారు. జనం ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్లు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు.
ఈ సందర్భంగా అంబులెన్స్లకు దారి ఇవ్వాలంటూ బస్ పైనుంచి విజయ్ సూచించడం వీడియోల్లో కనిపించింది. అలాగే తీవ్ర వేడితో ఊపిరాడక కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో విజయ్ వాటర్ బాటిల్స్ విసిరేయడం కూడా కనిపించింది. ఇలా విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీ 41 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది.
