మనకంతా ఫరక్ పడదు: ఇరాన్‎పై అమెరికా 25 శాతం సుంకాలపై స్పందించిన భారత్..!

మనకంతా ఫరక్ పడదు: ఇరాన్‎పై అమెరికా 25 శాతం సుంకాలపై స్పందించిన భారత్..!

న్యూఢిల్లీ: ఇరాన్‎తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనతో ఇరాన్‎తో వ్యాపారం చేస్తోన్న ఇండియాపై ఎంత మేర ప్రభావం పడనుందనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇరాన్‎తో బిజినెస్ చేస్తే అమెరికా విధిస్తామన్న 25 శాతం అదనపు సుంకాలు భారతదేశంపై కనీస ప్రభావాన్నే చూపుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 

ఈ టారిఫ్‎లతో ఇండియాపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదని క్లారిటీ ఇచ్చాయి. భారతదేశపు టాప్ 50 ప్రపంచ వాణిజ్య భాగస్వాములలో ఇరాన్ లేదని తెలిపాయి. గత సంవత్సరం ఇరాన్‌తో ఇండియా 1.6 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. ఇది ఇండియా మొత్తం వాణిజ్యంలో 0.15 శాతం మాత్రమే. సో.. అమెరికా 25 శాతం అదనపు టారిఫ్స్ ఇండియాపై ఏమంత ప్రభావం చూపించవని ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. 

2024లో ఇరాన్ మొత్తం దిగుమతులు దాదాపు 68 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడ్డాయి. ఇందులో 21 బిలియన్ (30 శాతం) డాలర్లతో యూఏఈ ఇరాన్ ప్రధాన దిగుమతి భాగస్వామిగా ఉంది. ఆ తర్వాత వరుసగా చైనా 17 బిలియన్లు (26 శాతం), తుర్కియే 11 బిలియన్లు (16 శాతం), యూరోపియన్ యూనియన్ 6 బిలియన్లు (9 శాతం) ఉన్నాయి.

ఇరాన్ దిగుమతుల్లో భారతదేశం వాటా కేవలం 1.2 బిలియన్లు (2.3 శాతం) మాత్రమే. భారత నుంచి ఇరాన్‎కు ప్రధానంగా బియ్యం ఎగుమతి అవుతాయి. ఇరాన్‌కు అతిపెద్ద బియ్యం సరఫరాదారు ఇండియానే. ఇరాన్ దిగుమతుల్లో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఇండియాదే. ట్రంప్ 25 శాతం సుంకాల ప్రకటనతో భారత్ నుంచి ఇరాన్‎కు బియ్యం సరఫరా బంద్ కానుంది. 

భారత్‎పై ప్రభావం..

భారత్-ఇరాన్ మధ్య ఏటా సుమారు రూ.15వేల కోట్ల వరకు వాణిజ్యం జరుగుతోంది. అయితే ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ ఇరాన్ నుండి సుమారు512 మిలియన్ డాలర్ల విలువైన ఆర్గానిక్ కెమికల్స్ దిగుమతికి ఆటంకం కలగనుంది. ఇవి ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. దీనికి తోడు బాదం, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ దిగుమతులు భారత్‌కు ప్రియంగా మారి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటికీ తోడు ముఖ్యమైన మ్యాటర్ చాబహార్ పోర్ట్. ఇరాన్‌లోని ఈ పోర్ట్ ద్వారా భారత్ మధ్య ఆసియా దేశాలకు వ్యాపారం చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో.. ట్రంప్ విధిస్తున్న ఈ గ్లోబల్ టారిఫ్స్ చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. బుధవారం వచ్చే తీర్పు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే.. ఈ టారిఫ్‌ల అమలు ఆగిపోవచ్చు. అది భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిస్తుంది. ఒకవేళ కోర్టు ట్రంప్‌కు మద్దతు ఇస్తే మాత్రం భారత ఎగుమతిదారులు అమెరికా మార్కెట్‌లో భారీ పోటీని ఎదుర్కోక తప్పదు. ఇదీ అమెరికాకు ఎగుమతులను తగ్గించి ట్రేడ్ డెఫిసిట్ పెంచుతుందని ఆందోళనలు ఎగుమతిదారులు వ్యక్తం చేస్తున్నారు. 

ఒకవైపు ఇరాన్‌పై సైనిక దాడులు చేసే ఆలోచనలో ఉన్న అమెరికా, మరోవైపు ఇలాంటి ఆర్థిక ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఇరాన్‌కు దూరం చేయాలని చూస్తోంది. భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూ.. అమెరికాతో చర్చల ద్వారా ఈ టారిఫ్ సెగ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది.