
ఓండా (బెంగాల్): రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ వంటి సంస్థలు చేపడుతున్న సేవా కార్యక్రమాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. తాను ఏ సంస్థకు వ్యతిరేకం కాదని తెలిపారు. కానీ, ఆ సంస్థలకు చెందిన ఒకరిద్దరు వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సూచనల కు అనుగుణంగా కొంత మంది సన్యాసులు పని చేస్తున్నారని తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వాటిపై మమత వివరణ ఇచ్చారు.
సోమవారం బంకురాలోని ఓండాలో ఎలక్షన్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. “రామకృష్ణ మిషన్‌కు నేను వ్యతిరేకం కాదు. సంస్థ మొత్తాన్నీ ఎందుకు అవమానిస్తా. ఒకరిద్దరు వ్యక్తులు గురించే మాట్లాడా. భారత్ సేవాశ్రమ్ సంఘం ప్రజల కోసం పని చేస్తుంది. ఆ సంస్థకు చెందిన కార్తీక్ మహారాజ్ గురించి నేను మాట్లాడాను. టీఎంసీ ఏజెంట్ ను రెజీనగర్ లోని పోలింగ్ బూత్ లో ఆయన కూర్చోనివ్వలేదు. బీజేపీ కోసం ఆయన పని చేయాలనుకుంటే తప్పకుండా పని చేయవచ్చు. కానీ, ఆ పార్టీ జెండా పట్టుకుని పని చేయాలి” అని పేర్కొన్నారు.