ఢిల్లీ సీఎం నివాసం నిర్మాణ పనుల్లో.. అక్రమాలపై త్వరలో కాగ్ ఆడిట్

ఢిల్లీ సీఎం నివాసం నిర్మాణ పనుల్లో.. అక్రమాలపై త్వరలో కాగ్ ఆడిట్

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్  అధికారిక నివాస నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కంప్ట్రోలర్  అండ్  ఆడిటర్  జనరల్(కాగ్) త్వరలో ఆడిట్  చేస్తుందని రాజ్ నివాస్  అధికారులు తెలిపారు. సీఎం అధికారిక నివాస నిర్మాణంలో అక్రమాలు జరిగాయని లెఫ్టినెంట్  గవ్నరర్(ఎల్జీ) వీకే సక్సేనా గత నెల 24న కేంద్రానికి లేఖ రాశారు. దీంతో పనులను  ఆడిట్  చేసేందుకు కేంద్ర హోంశాఖ కాగ్​ను రికమెండ్  చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే, దీనిపై కేజ్రీవాల్  ఆఫీస్  నుంచి ఎలాంటి రిప్లై రాలేదు.

1942లో కట్టిన సీఎం అధికారిక నివాసం శిథిలావస్థలో ఉండేదని, దానికి రిపేర్లు చేయాల్సిన అవసరం వచ్చిందని ఆప్ పేర్కొంది. కాగా, రిపేర్ల పేరుతో కేజ్రీవాల్  అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. ‘‘సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం, ప్రజాపనుల శాఖ గైడ్ లైన్స్  ఉల్లంఘించాయి. దీనిపై ఢిల్లీ చీఫ్​ సెక్రటరీ ఓ రిపోర్టు సమర్పించారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది” అని ఎల్జీ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.