V6 News

కేన్సర్ కోరల్లో ఇండియా

కేన్సర్ కోరల్లో ఇండియా

    300% పెరిగిన కేసులు   72 వేల కేసులతో గుజరాత్ టాప్‌‌‌‌‌‌‌‌

    నాలుగో స్థానంలో తెలంగాణ.. ఏపీలోనూ పెరుగుదల

    తెలంగాణలో13 వేలు, ఏపీలో 5 వేల మందికి కేన్సర్ 

    ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019’ నివేదికలో వెల్లడి  

దేశంలో కేన్సర్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే కేన్సర్ కేసులు భారీగా పెరిగిపోయాయి. ఓరల్, గర్భాశయ, రొమ్ము కేన్సర్ వంటి కామన్ కేన్సర్ కేసులు2017, 2018 మధ్య ఏకంగా 324% పెరిగాయి. దేశవ్యాప్తంగా 2018లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ సీడీ) క్లినిక్‌‌లకు 6,51,94,599 మంది రాగా, 1,68,122 మందికి ఏదో ఒక కేన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. 2017లో ఈ సంఖ్య 39,635 మాత్రమే ఉండగా, ఏడాది కాలంలోనే కేన్సర్ కేసులు భారీగా పెరిగాయని ఈ మేరకు ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019’ నివేదికలో వెల్లడైంది.

గుజరాత్ టాప్..

2018లో గుజరాత్‌‌లోనే అత్యధికంగా కేన్సర్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఎన్‌‌సీడీ క్లినిక్స్‌‌కు వచ్చిన పేషంట్ల సంఖ్య 24% పెరిగింది. 2017లో 3,939 మందికి కేన్సర్ రాగా, 2018లో 72,169 మందికి కేన్సర్ వచ్చినట్టు తేలింది. ఏడాదిలోనే 68,230 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్ తర్వాత స్థానాల్లో వరుసగా కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో అంతకుముందు ఏడాది కంటే కేన్సర్ రోగులు విపరీతంగా పెరిగారని నివేదిక తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిన ముప్పు

తెలంగాణలో గత ఏడాది 28,50,666 మంది ఎన్ సీడీ క్లినిక్స్‌‌కు రాగా, 13,130  మందికి కేన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఏపీలో గత ఏడాది 13,82,857 మంది ఎన్‌‌సీడీ క్లినిక్స్ కు రాగా, 5,705 మందికి కేన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ రాష్ట్రాల్లోనూ కేన్సర్ రోగులు ఎక్కువగానే పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

లైఫ్​స్టైల్, అలవాట్లే కారణం..

ఎన్ సీడీ క్లినిక్స్ కు వెళుతున్న పేషంట్ల సంఖ్య 2017, 2018 మధ్యలో 3.5 కోట్ల నుంచి 6.6 కోట్లకు అంటే రెట్టింపు అయినట్లు నివేదిక వెల్లడించింది. అయితే, ప్రజల లైఫ్​స్టైల్‌‌లో వేగంగా మార్పులు వస్తుండటం, రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరుగుతుండటం, ఆహారం అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి వాటి వల్లే కేన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ ను తొలిదశలో గుర్తిస్తేనే ట్రీట్ మెంట్ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యమయ్యే  కొద్దీ ముప్పు ఎక్కువవుతుందని అంటున్నారు.

స్మోకింగ్, డ్రింకింగ్ మిక్స్ చేస్తే అంతే

పొగాకు వాడటమే నోటి కేన్సర్ కు ప్రధాన కారణం. ముఖ్యంగా స్మోకింగ్, డ్రింకింగ్ ఒకేసారి చేయడం వల్ల నోటి కేన్సర్ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి కదలకుండా కూర్చుండిపోవడం, ఒబెసిటీ పెరగడం వల్ల కూడా అన్ని రకాల కేన్సర్ ల ముప్పు పెరుగుతుంది. తల్లులు బిడ్డలకు పాలు ఇస్తేనే వారికి భవిష్యత్తులో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తప్పుతుంది.

–  డాక్టర్ హర్ ప్రీత్ సింగ్, సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, యాక్షన్ కేన్సర్ హాస్పిటల్, ఢిల్లీ.