
లంకతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ను అక్షర్ పటేల్కు ఇవ్వడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య క్లారిటీ ఇచ్చాడు. ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలియాలనే చివరి ఓవర్ను అక్షర్ చేత వేయించానని తెలిపాడు. ఈ అనుభవం మెగా టోర్నీల్లో ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాండ్యా స్పష్టం చేశాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తాము అద్భుతంగా రాణిస్తామని...అందుకే తమకు తామే సవాల్ చేసుకుంటున్నామన్నాడు. మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి నుంచి గెలిచామని..ఇందుకు యువ ఆటగాళ్లు కారణమన్నాడు.
ఫిట్గానే ఉన్నా...
క్యాచ్ పట్టినప్పుడు తనకు ఎలాంటి గాయం కాలేదన్నాడు. అయితే కాళ్లకు తిమ్మిర్లు మాత్రమే వచ్చాయన్నాడు. తాను నవ్వితే పరిస్థితి బాగానే ఉంటుందని భావిస్తారన్న ఉద్దేశంతోనే ఫేస్‌ను భయానకంగా పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. నిద్రలేమి, తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల కండరాలు పట్టేశాయన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని పాండ్యా వెల్లడించాడు.
మావి మంచి బౌలరే..
తొలి టీ20లో శివం మావి అద్భుతంగా బౌలింగ్ చేశాడని పాండ్యా చెప్పాడు. ఐపీఎల్ సమయంలోనే అతని బౌలింగ్ను గమనించానన్నాడు. బ్యాట్స్ మన్ ఎదురుదాడికి దిగినప్పుడు ఆందోళన పడొద్దని..బౌలింగ్పై నమ్మకముంచాలని సూచించినట్లు చెప్పాడు.
రివేంజ్ సిరీస్ కాదు..
ఆసియా కప్‌లో లంక చేతిలో భారత ఓటమికి ప్రతికారం తీర్చుకునేందుకు ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని తాము అనుకోవడం లేదని పాండ్యా అన్నాడు. కానీ మెరుగైన ఆటను ప్రదర్శించేందుకు తాము ప్రయత్నిస్తామన్నాడు. లంకను బయపెట్టడానికి తాము కొత్తగా చేయాల్సినది ఏదీ లేదని..బాడీ లాంగ్వేజ్తో లంకను బయపెడతామన్నాడు. గత వైఫల్యాలను తన కెప్టెన్సీలో పునరావృతం కాకుండా చూసుకుంటానని పాండ్య పేర్కొన్నాడు.
ఉత్కంఠ మ్యాచ్లో అక్షర్కు బౌలింగ్
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 పరుగులతో గెలిచింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో శ్రీలంక విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ ఓవర్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ఇచ్చాడు. చివరి ఓవర్ ను అద్భుతంగా వేసిన అక్షర్..10 పరుగులే ఇవ్వడంతో టీమిండియా విజయాన్నందుకుంది.