కార్ల యజమానులూ జాగ్రత్త..! హెల్మెట్‌ పెట్టుకోలేదని వెయ్యి జరిమానా

కార్ల యజమానులూ జాగ్రత్త..! హెల్మెట్‌ పెట్టుకోలేదని వెయ్యి జరిమానా

మీకు కారుందా..! ఢిల్లీ, నోయిడా, ముంబై వంటి నగరాలకు ప్రయాణిస్తుంటారా..! అయితే ఈ వార్తా సారాంశం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. హెల్మెట్‌ ధరించకుండా కారు నడిపాడని ఓ వాహనదారుడికి నోయిడా పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం తెలిసి కారు యజమాని అవాక్కయ్యాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాకు చెందిన తుషార్ సక్సేనా హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఇటీవల రూ.1,000 జరిమానా విధించారు. ఈ ఘటనపై బాధితుడు తుషార్‌ సక్సేనా మాట్లాడుతూ రూ.1,000 జరిమానా చెల్లించాలని గతేడాది నవంబరులో మెసేజ్‌ వచ్చిందని.. అది పొరపాటున వచ్చిందేమోనని తాను పట్టించుకోలేదన్నారు. అనంతరం పదే పదే ఈ-మెయిల్స్, మెసేజ్‌లు రావడంతో పోలీసులను సంప్రదించానన్నారు.

ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ, తన సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. జరిమానా చెల్లించకపోతే కోర్టుకు రావలసి ఉంటుందని పోలీసులు తనను హెచ్చరించారని చెప్పారు. అదే సమయంలో పోలీసులకు పలు ప్రశ్నలు సంధించాడు. కారులో హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి జరిమానాను రద్దు చేయాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.